Naga Ramakrishna: డబ్బు అడిగితే ఇచ్చేవాణ్ని.. కానీ నా భార్యను అడిగాడు

‘సమస్య తీరాలంటే నా భార్యను తీసుకురమ్మన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ?’ కుటుంబసమేతంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన పాల్వంచ వాసి రామకృష్ణ ఆవేదనాభరితంగా పలికిన ఆఖరు మాటలివి.

Updated : 07 Jan 2022 05:06 IST

సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఆవేదన
ఈటీవీ, ఖమ్మం

‘సమస్య తీరాలంటే నా భార్యను తీసుకురమ్మన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ?’ కుటుంబసమేతంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన పాల్వంచ వాసి రామకృష్ణ ఆవేదనాభరితంగా పలికిన ఆఖరు మాటలివి. ‘నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. వేరే కుటుంబాలు పాడవకుండా ఇలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎదగనివ్వకండి’ అంటూ ఆయన విన్నవించారు. ఓవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూనే ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈనెల 3న తెల్లవారుజామున కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, వనమా రాఘవేంద్రరావు అరాచకాలు వివరిస్తూ నాగ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో గురువారం వైరల్‌ అయ్యింది. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మా కుటుంబ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకొన్న వనమా రాఘవేంద్రరావు.. ఏ భర్తా తన చెవితో వినగూడని మాట నా చెవిలో వేశారు. కాదు ఆర్డర్‌ చేశారు. నీ సమస్య తీరాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్‌ రా అన్నారు. అదీ పిల్లలు లేకుండా? ఆ తర్వాతే నేను నీ సంగతి చూస్తా. అప్పటి వరకు నీ సమస్య పరిష్కారం కాదు. ఎవడి దగ్గరికి వెళ్లినా ఎవడూ ఏమీ చేయలేడు. నీ భార్యను నువ్వు ఎప్పుడు హైదరాబాద్‌ తీసుకొస్తావో ఆ తర్వాతే పరిష్కారం జరుగుతుందే తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకొన్నా.. ఏం చేసుకున్నా మీ ఆస్తిలో నయాపైసా కూడా రాదు. నేను చెప్పిన పనిచేస్తే నీకు ఏం కావాలో అది చేస్తానన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ..! ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనమయ్యాయి. కొన్ని బయటకు వచ్చాయి. మరికొన్ని బహిర్గతం రాలేదు. నేను అభియోగం చేస్తున్నానని అనుకోవచ్చు.. వీటికి  రికార్డింగులు లేవు. ఫొటోలు తీసి పెట్టలేదు. ఇవన్నీ రాఘవేంద్రరావు చీకటి కోణాలు. ఎదుటి మనిషికి సాయం చేయాలంటే ఆ వ్యక్తి ద్వారా ఆయన ఏం లబ్ధి పొందగలరు అనేది ముందు చూసుకుంటారు. అలా నన్ను ఈ రకమైన సంక్షోభంలో పెట్టి నా భార్యను తనవద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం చేయనని చెప్పాడు. కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాణ్ని. మనిషిని కోరుకున్నాడండీ. నా భార్యను కోరుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేను. నా భార్యకు ఇంకా తెలియదు. ఇంకో భయం ఏమిటంటే నేను వీళ్లతో పోరాటం చేసే పరిస్థితుల్లో లేను. వాళ్ల ఆర్థిక, రాజకీయ అండదండల ముందు నా స్థాయి సరిపోదు. కాబట్టి నేను ఒక్కడిని ఏమైనా చేసుకుంటే నా భార్య పరిస్థితి ఏంటి? నా భార్యను అసలు వీళ్లు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లే. పిల్లలు ఏమైపోతారో అర్థం కావట్లే. అందుకే నాతోపాటే వాళ్లను తీసుకెళ్తా.  దయచేసి నా నిర్ణయాన్ని తప్పుపట్టకండి.  అందరినీ నేను విన్నవించుకునేది ఒకటే. నాకు సహకరించిన వాళ్లకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూడండి. థాంక్యూ’’ అని రామకృష్ణ ముగించారు. పొరపొచ్చాలు లేకుండా సాగిన తమ సంసారజీవితం, కుటుంబ ఆర్థిక సమస్యల గురించీ రామకృష్ణ ఈ వీడియోలో వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని