TET Results: 1,09,168 మంది పాస్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో మొత్తం 1,09,168 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది అర్హత సాధించారు.

Updated : 13 Jun 2024 07:30 IST

టెట్‌ పేపర్‌-1లో ఉత్తీర్ణత శాతం 67.13.. ఇప్పటివరకు ఇదే అత్యధికం
పేపర్‌-2లో 34.18% మంది ఉత్తీర్ణులు
ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

టెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో శ్రీదేవసేన, బుర్రా వెంకటేశం, మాణిక్‌రాజ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో మొత్తం 1,09,168 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది అర్హత సాధించారు. గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగగా.. వాటి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఉన్నత పాఠశాలల్లో(6-10 తరగతులు) బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల అర్హతకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన పాల్గొన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు, టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి లేకుండానే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

టెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

భారీగా పెరిగిన ఉత్తీర్ణత

గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన టెట్‌తో పోల్చుకుంటే ఈసారి పేపర్‌-1, 2లలో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. గతసారి పేపర్‌-1లో 36.89 శాతం మంది పాస్‌ కాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం 67.13కు పెరిగింది. అంటే 30.24 శాతం అధికం. పేపర్‌-2లో ఉత్తీర్ణత శాతం 15.30 నుంచి 34.18కి పెరిగింది. పేపర్‌-2లో గణితం-సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలకు రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. గణితం-సామాన్య శాస్త్రంలో 37.40 శాతం మంది, సాంఘిక శాస్త్రంలో 30.61 శాతం మంది పాసయ్యారు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు టెట్‌ నిర్వహించగా... ఈసారి పేపర్‌-1లో అత్యధికంగా 67.13 శాతం మంది పాస్‌ కావడం విశేషం. 

వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

ఈసారి టెట్‌ పరీక్షలకు దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఫీజు తగ్గింపు నిర్ణయం అమలుకు ఎన్నికల సంఘం అంగీకరించలేదని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని బుధవారం ప్రకటించింది. తాజా టెట్‌లో అర్హత సాధించనివారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించినవారు డీఎస్సీకి ఒకసారి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని