TG High Court: బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 06 Jul 2024 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన ఓ బాలికపై 10 మంది కామాంధులు 6 నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై గతంలో పోలీసు కేసు నమోదైంది. ఈ ఘటనలో బాలిక అవాంఛనీయ గర్భం దాల్చడంతో తొలగింపు నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు తిరస్కరించారు. దీంతో బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ గురువారం వాదనలు వినిపిస్తూ అభం శుభం తెలియని వయసులో దుర్మార్గుల చర్య వల్ల బాలిక గర్భం దాల్చిందన్నారు. దీనివల్ల ఆమె శారీరక, మానసిక వేదనకు గురవుతోందన్నారు. 26 వారాల గర్భస్థ పిండాన్ని తొలగించడానికి గాంధీ ఆసుపత్రి డాక్టర్లు నిరాకరించారన్నారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్‌ తదితర డాక్టర్లతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసి బాలిక ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సమర్పించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో సూపరింటెండెంట్‌ మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసి బాలికను పరీక్షించి ఆరోగ్య పరిస్థితిపై సీల్డ్‌కవర్‌లో శుక్రవారం నివేదిక అందజేశారు. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఇలాంటి  ఘటనలు బాధాకరమని, బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. బాలిక, ఆమె తల్లి అనుమతితో అబార్షన్‌కు చర్యలు తీసుకోవాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని