phone tapping: ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతిచ్చేది రాష్ట్ర హోంశాఖే

రాష్ట్ర పరిధిలోని ఫోన్‌ ఖాతాదారుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయాల్సివస్తే రాష్ట్ర హోంశాఖ తగిన అనుమతులను మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టుకు నివేదించింది.

Published : 04 Jul 2024 02:58 IST

హైకోర్టుకు నివేదించిన కేంద్రం
విచారణ 23కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పరిధిలోని ఫోన్‌ ఖాతాదారుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయాల్సివస్తే రాష్ట్ర హోంశాఖ తగిన అనుమతులను మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ (సస్పెండెడ్‌) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం విదితమే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్‌లను ట్యాప్‌ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని, కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరంలేదని కేంద్రం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపించారు. ఇంతక్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు వివరాలతో కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే అది రికార్డుల్లో లేకపోవడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తూ కౌంటరును రికార్డుల్లో ఉంచాలని న్యాయస్థానం.. రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటరు దాఖలు చేయాలని భావిస్తే తదుపరి విచారణలోగా చేయాలంటూ కేంద్రానికి సూచించింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్‌ హయతుద్దీన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హయతుద్దీన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పిటిషనర్‌ కూడా బాధితుడేనన్నారు. ‘‘పిటిషనర్‌ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. దాంతో ఆయనతో పాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫోన్‌ను ట్రాక్‌ చేయడం ద్వారా పిటిషనర్‌ ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుని పోలీసులు ఆయన్ను తీసుకెళ్లి బెదిరించిన సంఘటనలున్నాయి’’ అని వివరించారు. వాదనలను విన్న ధర్మాసనం... ప్రతివాదిగా చేర్చే అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని