TG News: విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!

విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది.

Published : 07 Jul 2024 03:43 IST

ఎయిర్‌పోర్టుల వద్ద వరుస ప్రమాదాలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
నివేదిక ఆధారంగా కట్టుదిట్టమైన చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో వరుసగా చోటుచేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (దిల్లీ), దుమ్నా విమానాశ్రయం(జబల్పూర్, మధ్యప్రదేశ్‌), రాజ్‌కోట్‌ విమానాశ్రయం(రాజ్‌కోట్, గుజరాత్‌)లలో ప్రయాణికుల రాకపోకల ప్రాంతాల్లో నిర్మించిన ఛత్రాలు(కెనోపి) ఇటీవల వరుసగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు విమానయాన ప్రయాణికుల్లో గుబులు రేపుతున్నాయి. భారీ వర్షాల కారణంగానే ఆయా విమానాశ్రయాల్లోని పైకప్పులు కూలిపోయాయని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రయాణికుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టుల వద్ద సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ సమీపంలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్‌) ఒక్కటే ప్రయాణికులకు పూర్తిస్థాయి సేవలు అందిస్తోంది. దీని ద్వారా సగటున నెలకు 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బేగంపేటలోని విమానాశ్రయాన్ని ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలు, రక్షణ శాఖ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు సేవలు అందించనప్పటికీ దీని ద్వారా వీవీఐపీల రాకపోకలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ఈ విమానాశ్రయాన్ని సైతం సేఫ్టీ ఆడిట్‌ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. 

వారం రోజుల్లో నివేదిక

విమానాశ్రయాల్లో భద్రతా ఆడిట్‌ నిర్వహించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రయణికుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై విమానాశ్రయాల అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని