IAS, IPS Transfers: బదిలీలకు వేళాయె!

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్‌ ఐఏఎస్‌ల వరకు స్థాన చలనాలు జరగనున్నాయి.

Published : 15 Jun 2024 06:09 IST

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల స్థానచలనాలకు రంగం సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్‌ ఐఏఎస్‌ల వరకు స్థాన చలనాలు జరగనున్నాయి. పోలీసు శాఖలోనూ ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసేందుకు సన్నద్ధమయింది. ఐఏఎస్, ఐపీఎస్‌లకు సంబంధించి కీలక స్థానాల్లో దీర్ఘకాలికంగా ఉన్నవారిని మార్చే అవకాశం ఉంది. పనితీరు ప్రాతిపదికన పలువురిపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారిని పాత ప్రాంతాలకు బదిలీ చేయడంతో పాటు శాఖాపరంగా పనితీరు ఆధారంగా మార్పులు చేపట్టాలని నిర్దేశించింది. 

సచివాలయంలో ఆరుగురికి పదోన్నతులు 

రాష్ట్ర సచివాలయంలో ఆరుగురు సహాయ కార్యదర్శులకు (అసిస్టెంట్‌ సెక్రటరీలకు) ఉప కార్యదర్శులు (డీఎస్‌లు)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని పురపాలక, విద్య, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, స్త్రీశిశు సంక్షేమ శాఖల్లో నియమించారు.

పశు సంవర్ధకశాఖలో డీపీసీ ద్వారా డైరెక్టర్‌ పోస్టుల భర్తీ.. 

త్వరలో పశు సంవర్ధకశాఖలో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించి డైరెక్టర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ శాఖలో డైరెక్టర్‌గా శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు అదనపు సంచాలకులు సుబ్బరాయుడు, మల్లేశ్వరి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ, పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో పోస్టులకు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. ఈ ఇద్దరికీ పదోన్నతులు కల్పించి డైరెక్టర్ల స్థాయిలో మూడు పోస్టుల బాధ్యతలు అప్పగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని