Thummala Nageswara: పారదర్శకంగా ఎరువుల సరఫరా

వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా పారదర్శకంగా సాగాలని.. పూర్తిగా ఇపోస్‌ ద్వారానే విక్రయాలు జరగాలని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అక్రమంగా విక్రయాలు జరిపితే డీలర్లతో పాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Published : 21 Jun 2024 06:13 IST

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు 
సమీక్షలో మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా పారదర్శకంగా సాగాలని.. పూర్తిగా ఇపోస్‌ ద్వారానే విక్రయాలు జరగాలని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అక్రమంగా విక్రయాలు జరిపితే డీలర్లతో పాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్‌ ఇన్వెంటరీ సిస్టమ్‌ ఆధారంగా వ్యవసాయాధికారులంతా విధిగా అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు నిల్వలు, విక్రయాలను పరిశీలించాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన వానాకాలం సీజన్‌ పంటల సాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,   ‘‘వానాకాలం సీజన్‌ కోసం రాష్ట్రానికి 10.40 లక్షల టన్నుల యూరియా, 2.40 లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 0.60 లక్షల టన్నుల ఎంవోపీ కేంద్రం కేటాయించింది. జులై చివరి నాటికి 5.65 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 లక్షల టన్నులు, 1.57 లక్షల టన్నుల డీఏపీకి గాను 1.47 లక్షల టన్నులు, 1.30 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులకు గాను 5.37 లక్షల టన్నులు, 0.38 లక్షల టన్నుల ఎంవోపీకి గాను 0.26 లక్షల టన్నులు అందుబాటులోకి తెచ్చాం. వీటిలో ఇంతవరకు 1.07 లక్షల టన్నుల యూరియా, 0.54 లక్షల టన్నుల డీఏపీ, 1.06 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. వానాకాలం సీజన్‌లో 17.5 లక్షల ఎకరాల్లో పంట సాగు మొదలైంది. అందులో పత్తి 15.65 లక్షల ఎకరాల్లో, కంది 76 వేల ఎకరాల్లో సాగవుతోంది. వారం పది రోజుల్లో వరి నార్లు, దుక్కులు పూర్తవుతాయి’’ అని మంత్రి తుమ్మల తెలిపారు.


కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ..

చ్చే ఆగస్టు నాటికి రాష్ట్ర అవసరాల మేరకు వీలైనంత త్వరగా ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ రాశారు. తెలంగాణలో వానాకాలం సీజన్‌ ముందుగా ఆరంభమవుతుందని, దానికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించిందని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని