ఒక్కోచోట.. ఒక్కో రకం!

కొవిడ్‌ సునామీలా విరుచుకుపడుతోంది. రెండో ఉద్ధృతిలో పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్‌ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా

Updated : 29 Apr 2021 09:28 IST

ఎక్కువగా యూ·కే, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకాలు..
కేసుల ఉద్ధృతికి ఇవి మాత్రమే కారణం కాదంటున్న శాస్త్రవేత్తలు
సగానికిపైగా కేసుల్లో పాత రకం వైరస్‌లే..
వ్యాప్తి గొలుసు తెగితేనే కట్టడి
కఠిన చర్యలు ఉండాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ సునామీలా విరుచుకుపడుతోంది. రెండో ఉద్ధృతిలో పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్‌ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. రకం ఏదైనా వ్యాప్తి గొలుసును తెంపాలంటే జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమని చెబుతున్నారు.

దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్‌ వైరస్‌ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం..దక్షిణాదిలో మరో రకం వైరస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఇంకో రకం వ్యాప్తిలో ఉంది.  ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న దిల్లీ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో యూకే రకం వైరస్‌ ఎక్కువగా ఉంది. బి.1.617 వైరస్‌ కూడా కనిపిస్తోంది. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో డబుల్‌ మ్యూటెంట్‌ రకం విస్తృతి కనిపిస్తోంది. పదిశాతం వరకు ట్రిపుల్‌ మ్యూటెంట్‌ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి డబుల్‌ మ్యూటెంట్‌లోనే ఇదో భాగం. బి.1.617-1,2,3, రకాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో 20 శాతం కేసుల్లో బి.1.618 వైరస్‌ కనిపిస్తోంది. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో ఎన్‌440కె రకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ డబుల్‌ మ్యూటెంట్‌ చాలా తక్కువగా ఉంది. యూకే రకం, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకం వైరస్‌లు ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నాయా? అంటే.. కేసులు పెరగడానికి ఇవి ఒక కారణమే తప్ప పూర్తిగా కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పాత రకాలు.. కొత్త సమస్యలు
ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ ఏదైనా వేగంగా ఉత్పరివర్తనం చెందుతుంది. ఈ కారణంగానే దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో కొత్త కరోనా వైరస్‌ రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. కేసులు పెరిగేకొద్దీ కొత్త ఉత్పరివర్తనాలతో వైరస్‌ రకాలు పెరగడానికి అవకాశం ఉంది. ‘పలు ప్రాంతాల్లో యూకే రకం, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకం వైరస్‌లు బలంగా వ్యాప్తి చెందుతున్నాయి. సగానికంటే ఎక్కువ కేసుల్లో పాత సాధారణ వైరస్‌ రకాలే ఉన్నాయి. అయినా ప్రతిచోటా కేసులు పెరుగుతున్నాయి. కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి ఒక్కటే కేసుల పెరుగుదలకు కారణం కాదు. కొత్తవి వచ్చినప్పుడు సహజంగానే కొత్త సమస్యలు వస్తాయి. వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధానమైన సమస్య. ఏరకం వైరస్‌ అనేది ప్రధానం కాదు.. వ్యాప్తి గొలుసు తెగితేనే కేసులు తగ్గుతాయి. మరోవైపు పాజిటివ్‌ కేసుల నమూనాల నుంచి వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా కొత్త వైరస్‌ రకాల ఉనికిని గుర్తించడంతో పాటూ రోగ లక్షణాలు, మరణాల రేటు, వాటిపై ఏ మేరకు టీకా పనిచేస్తుంది అనే పరిశోధనలు కొనసాగించాలి. సీసీఎంబీ ఇదే చేస్తోంది. అదృష్టవశాత్తు టీకాలు కొత్తరకాల వైరస్‌లపైనే సమర్ధంగా పనిచేస్తున్నాయి. కేసుల పెరుగుదల చూస్తే ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాం. భవిష్యత్తు దృష్ట్యా వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని