Telangana News: పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!

అదో మారుమూల గిరిజన గూడెం. అందులో 6 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తాయి. పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్తే గానీ వారి అవసరాలు తీరవు.

Published : 23 Mar 2023 06:58 IST

దో మారుమూల గిరిజన గూడెం. అందులో 6 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తాయి. పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్తే గానీ వారి అవసరాలు తీరవు. ఆ గూడెంలోని ఓ పసి పాప ఆకలి తీర్చేందుకు కూడా కుటుంబీకులు ప్రతిరోజూ 10 కిలోమీటర్ల మేర  ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. కొంతదూరం నడిచి... మరికొంత దూరం ఆ మార్గంలో వెళ్లే వాహనాలను అందిపుచ్చుకొని వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని రాజుగూడకు చెందిన కొడప పారుబాయి(22) జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కుటుంబసభ్యులు పారుబాయితో పాటు పసికందును మరుసటి రోజున గూడేనికి తీసుకెళ్లగా.. పది రోజులకే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఆ పసిపాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు పడరాని పాట్లు పడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు ప్రతిరోజూ రాజుగూడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని చిద్దరి ఖానాపూర్‌ వరకు కాలినడకన, అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి వాహనాల్లో వెళ్తూ పాల ప్యాకెట్‌ కొని తీసుకొస్తున్నారు. ఈ గూడెంలో ఎవరికి ఆవుగానీ, మేకగానీ లేదు. దీంతో కనీసం పసిపాప ఆకలి తీర్చడానికైనా ఆవు మంజూరు చేయాలంటూ ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటి వరకూ మంజూరవలేదని బాపురావు తెలిపారు.

న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని