Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు వేళాయె..

వైద్య ఆరోగ్యశాఖలో ఏడేళ్ల తర్వాత బదిలీలకు రంగం సిద్ధమవుతుండటంతో వందల మంది ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. వైద్యశాఖలోని మూడు ప్రధాన విభాగాలు.. ప్రజారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, వైద్య విద్య డైరెక్టరేట్‌లలో సిబ్బందిని కదిలించే అవకాశం ఉంది.

Published : 13 Jun 2024 05:25 IST

ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారి  జాబితా ప్రభుత్వానికి

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో ఏడేళ్ల తర్వాత బదిలీలకు రంగం సిద్ధమవుతుండటంతో వందల మంది ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. వైద్యశాఖలోని మూడు ప్రధాన విభాగాలు.. ప్రజారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, వైద్య విద్య డైరెక్టరేట్‌లలో సిబ్బందిని కదిలించే అవకాశం ఉంది. సాధారణ బదిలీలు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఈసారైనా పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్‌ వస్తుందని ఆశిస్తుండగా.. జిల్లాల్లోని వైద్యులు హైదరాబాద్, వరంగల్‌ వంటి నగరాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఒకే స్థానంలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న వారి వివరాలను అన్ని విభాగాల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శికి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వందలమంది డాక్టర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని అధ్యాపక వైద్యులు స్థానచలనం కోరుకుంటున్నారు. ఏడాది క్రితం పరిమిత సంఖ్యలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులిచ్చి బదిలీలు చేశారు. దీంతో ఈసారి డీఎంఈ పరిధిలో కూడా ఎక్కువమంది స్థానమార్పు ఆశిస్తున్నారు. బోధనాసుపత్రుల్లోని డాక్టర్లు కొందరు.. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనరసింహను కలిసి.. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలకు ఉన్న మినహాయింపుల గురించి ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ ఉత్తర్వుల వల్ల జిల్లాల్లో పనిచేస్తున్న వారు హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని, అన్ని కేడర్‌లలో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భార్యాభర్తల విషయంలో కూడా.. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వర్తించే నిబంధనలనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దంపతుల్లో ఎవరైనా ఒకరు.. గతంలో స్పౌజ్‌ కేటగిరీలో బదిలీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటే.. వారికి మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాతే అవకాశం కల్పించాలనే నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

ప్రజారోగ్య శాఖలో భారీగా..

ప్రజారోగ్య శాఖలో భారీగా స్థానచలనాలకు అవకాశం ఉంది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా వర్క్‌ ఆర్డర్లు, డిప్యుటేషన్ల ద్వారా చాలా మంది తాము కోరుకున్న చోట విధులు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరం అవన్నీ రద్దు కావడంతో.. వారంతా స్థానమార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, స్టాఫ్‌నర్సులతో పాటు ఏఎన్‌ఎంలు, కార్యాలయ సిబ్బంది ఈ కోవలో ఉన్నారు. ప్రజారోగ్యశాఖలో కొందరు మూడు నాలుగు పదోన్నతులు పొందినా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, సరిహద్దు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఖాళీలు భారీగా ఉండగా.. తాజా బదిలీలు సమస్యను పరిష్కరిస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని