TRS Plenary: ఇరవయ్యేళ్ల గులాబీ

రెండు పదుల వయసు... నిండు జవ్వన ఉత్సాహం... ఊరూరా శ్రేణులతో పునాదిని బలోపేతం చేసే యత్నం... భవితకు అదే పటిష్ఠమైన వారధి అన్న విశ్వాసం... 20 ఏళ్ల ప్రస్థానపు విజయాల స్మరణతో... భావి లక్ష్యాలపై గురి పెట్టి... తెలంగాణ రాష్ట్రసమితి మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు జరుగుతున్న ఈ సభను శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఘనంగా నిర్వహించేందుకు...

Updated : 30 Sep 2022 15:21 IST

ద్విదశాబ్ది ఉత్సవాల వేళ... తెరాస ప్లీనరీ నేడు  
భారీ ఎత్తున ఏర్పాట్లు... రానున్న ఆరున్నర వేల మంది
ఏడు తీర్మానాలకు సన్నాహాలు
గులాబీమయమైన హైదరాబాద్‌
ఈనాడు - హైదరాబాద్‌

రెండు పదుల వయసు... నిండు జవ్వన ఉత్సాహం... ఊరూరా శ్రేణులతో పునాదిని బలోపేతం చేసే యత్నం... భవితకు అదే పటిష్ఠమైన వారధి అన్న విశ్వాసం... 20 ఏళ్ల ప్రస్థానపు విజయాల స్మరణతో... భావి లక్ష్యాలపై గురి పెట్టి... తెలంగాణ రాష్ట్రసమితి మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు జరుగుతున్న ఈ సభను శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. తెరాస 13 ఏళ్లపాటు ఉద్యమం నడిపి, ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. మరో రెండేళ్లలో శాసనసభ... ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సంకల్పించారు. దీని కోసం బస్తీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు. పార్టీని పటిష్ఠం చేసే కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్‌ ఈ వేదికపై వివరించనున్నారు. ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో వచ్చే నెల 15న విజయగర్జన పేరిట భారీ బహిరంగ సభను కూడా తెరాస తలపెట్టింది.  ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై ఏడు తీర్మానాలు చేయనున్నారు. వీటిని ఏడుగురు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదిస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్‌పర్సన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.


పాసులు ఉంటేనే లోనికి అనుమతి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెరాస ప్లీనరీ సభలకు పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. పోలీసులు ఆదివారం సాయంత్రం హైటెక్స్‌ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీసీపీలు, 26 మంది ఏసీపీలు, 70 మంది ఇన్‌స్పెక్టర్లు, 192 మంది ఎస్‌ఐలు, 40 మంది ఏఎస్‌ఐలు, 1180 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మొత్తం 1,514 మంది బందోబస్తు నిర్వహిస్తారు. 750 మంది ట్రాఫిక్‌ పోలీసులు వీరికి అదనం. ఆదివారం సాయంత్రం హైటెక్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమైన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ప్లీనరీ సందర్భంగా పటిష్ఠ నిఘా ఉంచాలని ఆదేశించారు. పాసులున్న వారినే లోనికి అనుమతించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలు

సభకు వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేశారు. ఖానామెట్‌ జయభేరి సమీపంలో 3 నుంచి 4 వేల వాహనాలు నిలిపేలా మైదానాన్ని చదును చేసి ఉంచారు. న్యాక్‌ వెనుక భాగంలో మరో మైదానాన్ని కూడా కేటాయించారు. ప్రతినిధులు తమ వాహనాలను పార్కింగ్‌ ప్రాంతాల్లోనే నిలిపి హైటెక్స్‌ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రహదారులపై రద్దీ నెలకొనకుండా పోలీసులు ప్రత్యేక రూట్‌మ్యాప్‌లు తయారు చేసి ట్రాఫిక్‌ సిబ్బందికి అందజేశారు.

ఫ్లెక్సీలు.. స్వాగత ద్వారాలు

ప్లీనరీ వేదిక, ప్రాంగణాన్ని గులాబీ వర్ణంతో అలంకరించారు. సభావేదికపై కాకతీయ కళాతోరణంతో పాటు.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రధాన ద్వారం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను అలంకరించారు. కేసీఆర్‌ జీవితచరిత్ర, ఉద్యమఘట్టం నాటి ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరమంతా గులాబీమయంగా మారింది. పెద్దఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, తోరణాలు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని