TS News: లిఖిత హామీ ఇవ్వాల్సిందే

‘‘వానాకాలంలో పండిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చేవరకు దిల్లీలోనే ఉంటాం... ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు చెప్పాం. ఆయన అధికారులతో మాట్లాడి ఒకట్రెండు రోజుల్లో

Updated : 22 Dec 2021 04:14 IST

అప్పటివరకూ దిల్లీలోనే...
వానాకాలం ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల భేటీ
రెండు రోజుల్లో ఆదేశాలు ఇస్తామన్నారని వెల్లడి

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు

ఈనాడు, దిల్లీ: ‘‘వానాకాలంలో పండిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చేవరకు దిల్లీలోనే ఉంటాం... ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు చెప్పాం. ఆయన అధికారులతో మాట్లాడి ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు ఇప్పిస్తామని చెప్పారు. రాతపూర్వక హామీ వచ్చాకే తిరుగుపయనమవుతాం’’ అని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై స్పష్టత కోరేందుకు దిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను మంగళవారం కలిశారు. అనంతరం తెలంగాణభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వలేదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నాయకులు నెపం నెడుతున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలం చూపకపోవడం, రైల్వే రేక్‌లు అందుబాటులో ఉంచడం మీ బాధ్యతే అని కేంద్రమంత్రి గోయల్‌కు స్పష్టం చేశాం. రాష్ట్రం నుంచి నిత్యం 30, 40 మెట్రిక్‌ టన్నులు తీసుకెళ్లే అవకాశం ఉన్నా అలా చేయడం లేదు. నెలకు పది లక్షల మెట్రిక్‌ టన్నుల మిల్లింగ్‌ సామర్థ్యం తెలంగాణకు ఉందని వివరించాం. మేం చెప్పిన విషయాలను విన్న మంత్రి ఇక నుంచి వేగం పెంచి గత సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని వెంటనే తెప్పించుకుంటామని చెప్పారు. వచ్చే యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పుడుబియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. మన దగ్గర యాసంగిలో వచ్చే ఆ బియ్యాన్ని కొనరనే విషయం స్పష్టమైపోయింది. వానాకాలం పంటకు సంబంధించి కొనుగోలు దాదాపు పూర్తయిందని, కొనుగోలు కేంద్రాల వద్ద 10-15 ఎల్‌ఎంటీ ధాన్యం ఉందని, మరో అయిదు లక్షల ఎకరాల్లో పంట కోతలు చేపట్టాల్సి ఉందని కేంద్రమంత్రికి వివరించాం.ఆ ధాన్యమంతా కొనుగోలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వకపోతే కొనుగోలు చేయలేమని చెప్పాం. పార్లమెంట్‌ ఉభయ సభల్లో దానిపై ఇప్పటికే మాట్లాడానని కేంద్రమంత్రి చెప్పారు. ఆ విషయాన్నే రాతపూర్వకంగా ఇవ్వాలని కోరాం. రాతపూర్వక హామీ వచ్చేవరకు ఇక్కడే ఉంటామని చెప్పాం. వెసులుబాటు ఆధారంగా సమయం ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరాం. భాజపా వారిలాగా చిన్నబుచ్చేలా మాట్లాడలేదు’’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర మంత్రులు కమలాకర్‌, దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, భాజపా ఎంపీలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే వ్యాగన్లు ఇవ్వని అంశంపై వారం క్రితమే తాను కేంద్రమంత్రి గోయల్‌కు చెప్పగా ఆ రోజు ఆయన రైల్వే మంత్రికి ఫోన్‌ చేశారని తెలిపారు. ఈ రోజు మళ్లీ గుర్తుచేయగా రైల్వే మంత్రికి మరోసారి ఫోన్‌ చేశారన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో ఖాళీ ఉంచకపోవడం, రైల్వే వ్యాగన్లు అందుబాటులో ఉంచకపోవడం.. ఇలా ప్రతి దశలో వాళ్ల తప్పులే ఉన్నాయన్నారు. రెండురోజుల్లో లిఖితపూర్వక హామీ రాకుంటే ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరాలని మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని