Published : 29 Dec 2021 05:28 IST

CJI: మరో గ్రంథాలయోద్యమం రావాలి

యువతను పుస్తక పఠనం వైపు మళ్లించాలి
హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో పుస్తకాలు కొనుగోలు చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలలు, కళాశాలల్లో గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణ సూచించారు. ప్రస్తుతం పాఠశాల ఏర్పాటు చేయాలంటే గ్రంథాలయం, క్రీడా మైదానం ఉండాలనే నిబంధనను ఎవరూ పాటిస్తున్నట్లుగా లేదని,. ఇది తీవ్రమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గ్రామాల్లో గ్రంథాలయాలనూ పునరుద్ధరింపజేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కీలక తీర్పులను తెలుగు, హిందీ వంటి భాషల్లో అనువదించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. తొలుత తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు తీర్పులన్నీ తెలుగులో వచ్చేలా చూడాలని కోరారు. జస్టిస్‌  రమణ స్పందిస్తూ.. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌, జ్యుడిషియల్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తెలుగులో తీర్పులు ఇవ్వాలని ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు.  సుప్రీంకోర్టు తీర్పులను వివిధ భాషల్లోకి అనువదించి వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు.

పుస్తక ప్రదర్శన అభినందనీయం..
‘‘పుస్తకం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని భావిస్తున్న తరుణంలో.. ఇలాంటి ప్రదర్శనల ఏర్పాటు అభినందనీయం. యువత పెద్దసంఖ్యలో వచ్చి పుస్తకాలు కొనడం చూస్తే పుస్తకం పది కాలాలపాటు సజీవంగా ఉంటుందన్న నమ్మకం కలుగుతోంది. నేను చదువుకున్న రోజుల్లో పాఠశాల, ఊరి గ్రంథాలయాల్లో నిత్యం అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివేవాడిని. ఆ జ్ఞానమే జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడింది.

ఆ నవల ఎన్నోసార్లు చదివా..
చిన్నప్పుడు సోవియట్‌ ప్రచురణల రూపంలో పేరున్న రచనలు వచ్చేవి. మాక్సిమ్‌ గోర్కీ రాసిన ‘అమ్మ’, వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ‘ప్రజల మనిషి’ ఎన్నోసార్లు చదివా. వాటిని చదువుతుంటే ఆ కాలంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది.  

 

సాహితీవేత్త విఠలాచార్యను సన్మానిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, చిత్రంలో రమణాచారి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జూలూరు గౌరీశంకర్‌

ఉత్తరాలు రాసే సంస్కృతి రావాలి
‘‘నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి లేఖలు రాశారు. అందువల్లే ఆమె ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇప్పుడు అలా లేఖలు రాసే సంస్కృతి  పోయింది. దాన్ని పెంచాల్సి ఉంది. సంక్షిప్త సందేశాల కారణంగా భాష, భావం అర్థం కాకుండా పోతున్నాయి. డిజిటల్‌ మీడియాలో సినిమాలపై తప్పించి పుస్తకాలపై సమీక్షలు చాలా అరుదుగా  ఉంటున్నాయి.
పుస్తక ప్రచురణకర్తల బాధలు నాకు తెలుసు. నేను లా చదివే రోజుల్లో ‘నడుస్తున్న చరిత్ర’ పేరిట పక్షపత్రిక నడిపాను. ఎన్ని బాధలు అనుభవించానో..నడపలేక ఎలా మూసివేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ప్రస్తుతండిజిటల్‌ పైరసీ కారణంగా పుస్తకం ముద్రణకు నోచకుండానే బయటకు వెళ్లిపోతోంది. అందుకే పైరసీ కేసులు వస్తే కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తులకు చెబుతున్నా’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు. తొలుత ఆయన స్టాళ్లను సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు.
-  మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు శాశ్వత వేదిక కేటాయించే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ల విఠలాచార్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పుస్తక ప్రదర్శన ప్రతినిధులు కోయ చంద్రమోహన్‌, పి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు వికీపీడియాలో వ్యాసాన్ని ఎడిట్‌ చేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. మంగళవారం హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా తెలుగు వికీపీడియా స్టాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓ వ్యాసాన్ని పరిశీలించి ఎడిట్‌ చేశారు. కొంత సమాచారాన్ని జోడించారు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి వికీపీడియన్లు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.


యువతరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు తెలుగు నాట మరోమారు గ్రంథాలయ ఉద్యమం తీసుకురావాలి. బొకేలు, శాలువాలు మానేసి.. పుస్తకాలు బహూకరించాలి. నేను ఇప్పటికే వేల పుస్తకాలు సేకరించా. పదవీ విరమణ తర్వాత అవి చదువుకుంటూ గడుపుతా. అంతే కాదు.. జనం చదువుతారన్న నమ్మకం కలిగినప్పుడు నేనూ ఒక పుస్తకం రాస్తా.


‘‘వ్యాయామం, పుస్తక పఠనం జీవితంలో ఎంతో మార్పు తీసుకువస్తాయి. ఈ రెండూ పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పుస్తకం చదివితే విజ్ఞానం పెరుగుతుంది. ఆడియో పుస్తకాలతో అది రాదు’’

-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని