Published : 09 Jan 2022 05:46 IST

Politics: దేశానికి భాజపా ప్రమాదకరం

భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం
కేసీఆర్‌తో భేటీలో వామపక్ష నాయకులు
జాతీయ రాజకీయాలు, కేంద్రం వైఖరిపై చర్చ

శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన భేటీలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్‌, మాణిక్‌సర్కార్‌, రామచంద్రన్‌ పిళ్లై, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌ తదితరులు

ఈనాడు హైదరాబాద్‌: దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రమాద]కరంగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం సహా అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, వామపక్ష పార్టీల జాతీయ నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ సహా సీపీఎం జాతీయ నాయకులు, యువజన సమాఖ్య జాతీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ నాయకులు వేర్వేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.  భాజపా విధానాలకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చర్చల్లో ప్రధానంగా వ్యక్తమైనట్లు సమాచారం. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి విజయన్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్‌ పిళ్లై, బాలకృష్ణన్‌, ఎం.ఎ.బేబి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినయ్‌విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్‌, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు ఇందులో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట సీపీఎం నాయకులు, తర్వాత సీపీఐ నాయకులు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, దేశంలో పరిస్థితులు, అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు తదితర అంశాలపై చర్చించుకొన్నట్లు తెలిసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక అవసరం తదితర విషయాలూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, వివిధ సంస్థల వినియోగం.. ఇలా అనేక అంశాలు కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిందిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. భాజపాను గద్దె దించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్‌ కార్యాచరణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు చెప్పినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రైతు వ్యతిరేక పాలన, విభజన రాజకీయాలకు పాల్పడుతుండటం.. ఇలా పలు అంశాలు భేటీలో చర్చకు వచ్చాయని అందులో పాల్గొన్న ఓ నాయకుడు తెలిపారు. పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన మోదీకి అక్కడ రైతుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో వెనక్కు వచ్చారని, పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాల్లోనూ భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వామపక్ష నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ రోజురోజుకు బలహీనపడుతుండటం.. ఆ పార్టీ విధానాల గురించీ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను, ఇతర నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలువాలతో సత్కరించారు. సమావేశం అనంతరం విజయన్‌ చేసిన ట్వీట్‌లో కేసీఆర్‌ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చలు ఎంతో ఉపయోగకరంగా జరిగాయన్నారు.

రాజాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేసీఆర్‌, పక్కన వినోద్‌కుమార్‌, మహమూద్‌అలీ, రాజన్‌, బినయ్‌ విశ్వం, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని