CM KCR: ఇంత జాప్యమా!

సీతారామ, సమ్మక్కసాగర్‌, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేసి 5 నెలలు గడిచినా కేంద్ర జలసంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు అడిగిన అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని ఇచ్చి వేగంగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం ఆయన ఉన్నతస్థాయి...

Published : 10 Jan 2022 05:34 IST

జలసంఘం అనుమతుల్లో ఆలస్యంపై సీఎం అసంతృప్తి
కొత్త ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సీతారామ, సమ్మక్కసాగర్‌, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేసి 5 నెలలు గడిచినా కేంద్ర జలసంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు అడిగిన అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని ఇచ్చి వేగంగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలన్నారు. బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్‌ నోటిఫికేషన్‌ నుంచి తొలగించే విషయమై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పనులు, అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజీ, చెన్నూర్‌ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలి. వీటిని పూర్తిచేస్తే సాగునీటి రంగంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటాం’ అని అన్నారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి  

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంక్రాంతికి గుంపులుగా చేరకుండా ఎవరి ఇళ్లల్లో వారు తగు జాగ్రత్తలతో పండగ జరుపుకోవాలన్నారు. అర్హులైన వారంతా టీకాలు వేయించుకోవాలన్నారు. 15-18 సంవత్సరాల వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోందని, తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు టీకా వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు, కరోనా యోధులకు (ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, హెల్త్‌ కేర్‌ వర్కర్లు) మూడో డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. కరోనాపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ‘ఆసుపత్రుల్లో ఔషధాలు, పడకలు, ఆక్సిజన్‌, సేవలను అందుబాటులో ఉంచాలి. ఎక్కడా ఎలాంటి లోపం ఉండరాదు’ అని సీఎం సూచించారు.

సచివాలయానికి పటిష్ఠ భద్రత

సచివాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, రక్షణ వ్యవస్థ, అనుబంధ భవనాల నిర్మాణాలను సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. ‘గడువులోగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. పటిష్ఠమైన భద్రత కల్పించాలి. అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి’ అని సూచించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని