Kishan Reddy: సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా

సింగరేణి సంస్థకు మేలు చేయడానికి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Published : 22 Jun 2024 06:46 IST

ఈ సంస్థ రాష్ట్రంతో పాటు కేంద్రానిది కూడా
బొగ్గు వేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గనులను నేరుగా కేటాయించాలంటూ భట్టి వినతిపత్రం

కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థకు మేలు చేయడానికి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పదో విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సింగరేణి సంస్థను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సింగరేణిని ఆదుకునేందుకు అన్నివిధాలా సహకరిస్తాం. రెండు గనులు సింగరేణికి ఇవ్వాలనే అంశం మా దృష్టిలో ఉంది. బొగ్గు గనుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. నామినేషన్‌పై ఎవరికీ ఇవ్వడం లేదు. అయినా సింగరేణిని అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్థలో కొన్ని సమస్యలున్నాయి. మా శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. సింగరేణిపై రాజకీయం చేయవద్దు. దీనికోసం అందరం కలసి పనిచేద్దాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కార్మికులకు హామీ ఇస్తున్నాను. 

భారాస హయాంలో నష్టపరిచే నిర్ణయాలు

గత భారాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సింగరేణి సంస్థపై ప్రభావం పడింది. సింగరేణిపై గత ప్రభుత్వం అజమాయిషీ చేసి అనేక రకాలుగా నష్టం కలిగించేలా వ్యవహరించింది. ఒడిశాలో నైనీ గనిని 2015లో సింగరేణికిస్తే ఇప్పటివరకూ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం వచ్చినందున వారితో నేను మాట్లాడి నైనీలో బొగ్గు ఉత్పత్తి జరిగేలా చూస్తాం. సింగరేణి సంస్థ కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు కేంద్ర ప్రభుత్వానిది కూడా. దీనిపై రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో.. అంతే బాధ్యత కేంద్రంపైనా ఉంది. కోల్‌ ఇండియాకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యం కంటే ఒక అడుగు ముందుకువేసి సింగరేణికి ఇస్తాం. 

కాంగ్రెస్‌ పాలనలో అడ్డగోలుగా కేటాయింపులు

గతంలో కాంగ్రెస్‌ పార్టీ పాలనలో తెల్లకాగితాలపై ఎవరికి సిఫార్సులు రాసిస్తే వారికే గనులను అప్పగించేవారు. ఈ విధానానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్వస్తి పలికింది. బొగ్గు గనులను లాభాలబాటలోకి తేవాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలని, దేశంలో బొగ్గు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే కేంద్రం పారదర్శకంగా గనులను వేలం వేస్తోంది. వేలం వల్ల కేంద్రానికేమీ ఆదాయం రాదు. రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకే అదనపు రాబడి వస్తుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. గనుల్ని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తప్పుడు మాటలు మాట్లాడకూడదు. 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌ గ్యాసిఫికేషన్‌ కోసం అనేక ప్రోత్సాహాకాలిస్తున్నాం. బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి దేశప్రజల నుంచి సలహాలను ఆహ్వానిస్తున్నాం’అని కిషన్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని