Kishan Reddy: సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు

సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్‌ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు.

Published : 20 Jun 2024 06:16 IST

అది కేసీఆర్‌ చేసిన విషప్రచారం.. 
గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే
బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు
ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్‌ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు. దిల్లీలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.  దేశంలోని ఏ ప్రభుత్వరంగ బొగ్గు సంస్థనూ తాము ప్రైవేటీకరణ చేయబోమన్నారు.

‘‘బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాలని, నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానివల్లే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల వేలం నిర్వహించి.. 300 గనులను వేలం వేసింది. ఈ నెల 21న పదో రౌండ్‌ వేలం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకే ఆదాయం వస్తుంది. బొగ్గు, గనుల వేలం కారణంగా ఒడిశా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది. 

ఈసారి వేలంలో పాల్గొననున్న సింగరేణి

బొగ్గు గనులను తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేలాన్ని వ్యతిరేకించారు. అందుకే  వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారు. అయితే ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మా శాఖ పూర్వ మంత్రి ప్రహ్లాద్‌జోషీకి చెప్పారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. సింగరేణికి సాయం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయబోదు. ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉంది కనుక.. రోజువారీ పరిపాలనాధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఎండీని వాళ్లే నియమిస్తారు. కేంద్ర జోక్యం 1% కూడా ఉండదు. సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైటీకరిస్తోందని కేసీఆర్‌ ఇదివరకు అసత్యాలు ప్రచారం చేశారు. మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు కేంద్రం దాన్ని ఎలా ప్రైవేటీకరించగలుగుతుంది? దేశంలోని 12 ప్రభుత్వరంగ సంస్థల్లో దేన్నీ ప్రైవేటీకరించిన దాఖలా లేదు. సింగరేణి ప్రైవేటీకరణ జరగదని 100% భరోసా ఇస్తున్నా.

బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత చాలా తక్కువ. దాని ఆధారంగా స్టీల్‌ప్లాంట్‌ పెట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నాలుగు కమిటీలు చెప్పాయి. అలాంటప్పుడు ఉక్కు కర్మాగారం ఎలా పెడతాం? బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంటు కడుతుందని కేసీఆర్‌ 2018 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో ఎందుకు కట్టలేదో ఆయన చెప్పాలి. 

రెండు పదవులు కష్టమని పార్టీకి చెప్పాను

నన్ను రెండు పదవుల్లో కొనసాగించడమా? లేదా? అన్నది పార్టీ ఇష్టం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తాత్కాలికంగానే నియమించారు. రెండు పదవులు కష్టమని పార్టీ పెద్దలకు చెప్పాను. ఇప్పటికే నాకు జమ్మూకశ్మీర్‌ బాధ్యతలు అప్పగించినందున అక్కడ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. తెలంగాణ భాజపా అధ్యక్ష మార్పిడి ఎప్పుడు ఉంటుందో తెలియదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించాల్సి ఉంది. తెలంగాణలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లపై దర్యాప్తు జరగాల్సిందే. కేసీఆర్‌ తప్పు చేయనప్పుడు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ముందు హాజరవడానికి అభ్యంతరం ఎందుకు? 

విచారణలపై రేవంత్‌ సర్కారు నాన్చుడు ధోరణి

ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడింది రాష్ట్ర పోలీసులే. వారిమీద మళ్లీ రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేయడం వల్ల న్యాయం జరగదు. కాబట్టి సీబీఐ, లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరపడం అవసరం. బొగ్గు కుంభకోణంపై గతంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగడంవల్లే దోషులు జైలుకెళ్లారు. అందువల్ల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోనూ హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి. రాష్ట్రంలో గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం అవకతవకలపై సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే బాగుండేది. 

విశాఖ స్టీల్, పోలవరం ప్రాజెక్టులకు సాయం 

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దస్త్రంలో ప్రస్తుతం ఏమీ కదలిక లేదు. దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు కనిపించడంలేదు. ఇప్పట్లో దాని ప్రైవేటీకరణ జరగదు. కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.3 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు, ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. మా మంత్రిత్వశాఖలతో మాట్లాడి అందుకు అవకాశం ఉందా? అని చర్చిస్తా. నాకు తెలిసినంతవరకు వైజాగ్‌ స్టీల్‌ కూడా వేలంలో పాల్గొని గనులను సొంతం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దాని నిర్మాణం పూర్తి చేయడానికి మోదీ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారానికి ఇకపై నేను కూడా తగిన చొరవ తీసుకుంటా’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని