Kishan Reddy: జీవితంలో యోగా భాగం కావాలి

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 22 Jun 2024 05:53 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నిజాం కళాశాల మైదానంలో ఆసనాలు వేస్తున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సతీశ్‌చంద్ర దూబే, ఎంపీ లక్ష్మణ్‌ తదితరులు

ఈనాడు - హనుమకొండ, న్యూస్‌టుడే- దేశాయిపేట, వరంగల్‌ సాంస్కృతికం, నారాయణగూడ, నందిగామ: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో శుక్రవారం అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్‌ (ఏబీవీ), నిజాం కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. యోగాను అలవాటుగా మార్చుకుంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరమే రాదన్నారు. రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం 192 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని... ఇది ఒక కులానికో, మతానికో సంబంధించింది కాదని పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే కూడా ప్రసంగించారు. నిజాం కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.బీమా, ముథోల్, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు పవార్‌ రామారావు పాటిల్, డా.పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, భాజపా నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, సి.కృష్ణాయాదవ్, చింతల రామచంద్రారెడ్డి, సామాజికవేత్త బి.శ్యామసుందర్‌గౌడ్, నిజాం కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఉపేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ సురేఖా ఓంప్రకాశ్, ఎంఎల్‌ఆర్‌ఐటీ ఛైర్మన్‌ మర్రి లక్ష్మారెడ్డి, పతంజలి యోగ ప్రతినిధులు నందనం కృపాకర్, సత్యారెడ్డి, మధుసూదన్, ఎస్‌.ఎన్‌.రెడ్డి, బ్రహ్మకుమారి అంజలి, షాహిద్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. 


ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆవరణలో యోగా చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే తదితరులు

కన్హ శాంతివనంలో గవర్నర్‌

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని ధ్యానమందిరంలో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రెండు వేల మంది అభ్యాసీలు ఆసనాలను ప్రదర్శించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్‌ ప్రతినిధి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ సీకేఎం కళాశాలలో 10 వేల మంది విద్యార్థుల యోగా (డ్రోన్‌ చిత్రం)

పది వేల మంది విద్యార్థులతో యోగా
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

వరంగల్‌లోని సీకేఎం కళాశాల మైదానంలో శుక్రవారం వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవాన్ని చిన జీయర్‌స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని 60 పాఠశాలలు, 25 కళాశాలలకు చెందిన పది వేల మంది విద్యార్థులు, భక్తులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించిందని ముఖ్య పరిశీలకుడు, జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్‌కుమార్‌ ప్రకటించారు. చిన జీయర్‌స్వామి సమక్షంలో వికాస తరంగిణి ప్రతినిధులకు రికార్డుల పత్రాలను ఆయన అందించారు.

వరంగల్‌లో శిక్షకులతో కలిసి త్రిదండి చిన జీయర్‌స్వామి యోగా

 


కన్హ శాంతివనంలో యోగాసనం  వేస్తున్న గవర్నర్‌ రాధాకృష్ణన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని