Union ministers: మాతృభాషకు జై కొట్టిన కేంద్ర మంత్రులు

కొత్త లోక్‌సభలో మాతృభాషలు ప్రతిధ్వనించాయి. వివిధ రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులు సోమవారం లోక్‌సభ సభ్యులుగా తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేశారు.

Published : 25 Jun 2024 06:12 IST

లోక్‌సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం
సంప్రదాయ వస్త్రధారణలో కిషన్‌రెడ్డి
ఏపీలోని 24 మంది పూర్తి..
నేడు ప్రమాణం చేయనున్న తెలంగాణ ఎంపీలు

ఎంపీలుగా ప్రమాణం చేస్తున్న మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ 

ఈనాడు, దిల్లీ: కొత్త లోక్‌సభలో మాతృభాషలు ప్రతిధ్వనించాయి. వివిధ రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులు సోమవారం లోక్‌సభ సభ్యులుగా తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేశారు. వారిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణం చేశారు.

ఒకరు సంస్కృతంలో.. 

అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మొదట ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో వైఎస్‌ అవినాష్‌రెడ్డి తప్ప మిగిలిన 24 మంది సోమవారం ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు మినహా మిగిలిన వారిలో 12 మంది తెలుగులో, ఏడుగురు ఇంగ్లిష్‌లో, ఒకరు సంస్కృతం, మరొకరు హిందీలో చేశారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. 

  • ఏపీ నుంచి తెలుగులో ప్రమాణం చేసిన వారిలో కలిశెట్టి అప్పలనాయుడు, ఎం.శ్రీభరత్, దగ్గుబాటి పురందేశ్వరి, బాలశౌరి, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, గురుమూర్తి, దగ్గుమళ్ల ప్రసాద్‌ ఉన్నారు. 
  • సీఎం రమేష్, ఉదయ్‌ శ్రీనివాస్, హరీష్‌ మాథుర్‌ బాలయోగి, పుట్టా మహేశ్‌యాదవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు ఇంగ్లిష్‌లో చేశారు. 
  • తెన్నేటి కృష్ణప్రసాద్‌ సంస్కృతంలో, గుమ్మ తనూజా రాణి హిందీలో ప్రమాణం చేశారు.

పంచెకట్టులో సైకిల్‌పై పార్లమెంటుకు వచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు


పంచెకట్టులో కిషన్‌రెడ్డి

పార్లమెంటులో పంచెకట్టుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పంచెకట్టుతో వచ్చి తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. అప్పలనాయుడు 50-అశోకా రోడ్డులోని నివాసం నుంచి పార్లమెంటుకు తెదేపా ఎన్నికల చిహ్నమైన సైకిల్‌పై వచ్చారు. ఒక్కో ఎంపీ తరఫున ఐదుగురు అతిథులను అనుమతించారు. వారంతా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని కార్యక్రమాన్ని తిలకించారు. ఎంపీల ప్రమాణం ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్, ప్యానల్‌ స్పీకర్‌ రాధామోహన్‌సింగ్‌ల ఆధ్వర్యంలో సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని