Aadhar: ‘ఆధారం’ పోతోంది!

సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలో పలువురు... ఆధార్‌ కార్డుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే అవి డీయాక్టివేట్‌ అయినట్లు కనిపిస్తుండడంతో వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 23 Jun 2024 06:40 IST

డీయాక్టివేట్‌ అవుతున్న కార్డులు
ప్రాంతీయ కార్యాలయంలో ప్రహసనంగా పునరుద్ధరణ ప్రక్రియ
అక్కడ వివరణ ఇచ్చేవారే లేరని బాధితుల ఆవేదన

ఈనాడు, కామారెడ్డి; న్యూస్‌టుడే, తాడ్వాయి: సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలో పలువురు... ఆధార్‌ కార్డుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే అవి డీయాక్టివేట్‌ అయినట్లు కనిపిస్తుండడంతో వారిని ఆందోళనకు గురిచేస్తోంది. వాటిని తిరిగి యాక్టివేట్‌ చేయించుకునే ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆధార్‌ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్‌ కేంద్రాలకు వెళ్లినప్పుడు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ తదితర సందర్భాల్లో ఇవి బయటపడుతున్నాయి. 

ఇవీ.. ప్రధాన కారణాలు!

ఆధార్‌కార్డుల జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో వయసు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్‌ కార్డులు డీయాక్టివేట్‌ అవుతున్నాయి. డీయాక్టివేట్‌ అవడం అంటే మన వద్ద ఆధార్‌ కార్డు ఉన్నా ఆన్‌లైన్‌లో దానికి సంబంధించిన వివరాలు ఉండవు. ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల బీడీ కార్మికులు పీఎఫ్‌ కోసం వయసు సవరణలకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఆధార్‌లు డీయాక్టివేట్‌ అయ్యాయి. ఆధార్‌కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలి ముద్రల బదులు వారివి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకుంటున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్‌ అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన సాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయనకు మొదటి నుంచి అసలు ఆధార్‌ కార్డే లేకుండా పోయింది. ఆయన కుమారుడి కార్డు అప్‌డేట్‌ చేయబోతే అది డీయాక్టివేట్‌ అయిపోయింది. ప్రాంతీయ కార్యాలయంలో 40 సార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

ఏళ్ల నుంచి తహసీల్దార్‌ లాగిన్‌లలో...

ఆధార్‌ రీజినల్‌ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాల నిర్ధారణకు అది తహసీల్దార్‌ లాగిన్‌కు అర్జీలను పంపుతుంది. పనిఒత్తిడి, ఇతర కారణాలతో చాలాచోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్‌ లాగిన్‌ తెరిచి వెరిఫికేషన్‌ చేయట్లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్‌ లాగిన్‌లలో అవి పెండింగ్‌లో ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఇలా...

ఆధార్‌కార్డుల పునరుద్ధరణ కోసం హైదరాబాద్‌ మైత్రీవనంలోని ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి జారీ చేస్తామని చెబుతున్న అధికారులు వారం రోజుల తర్వాత సరైన ధ్రువపత్రాలు సమర్పించలేదని తిరస్కరిస్తున్నట్లు లేఖ పంపుతున్నారు. దానిపై ప్రాంతీయ కార్యాలయంలో వివరణ ఇచ్చేవారే లేకుండా పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వయసు సవరణ సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా కార్డు డీ యాక్టివేట్‌ అయింది. ప్రాంతీయ కార్యాలయంలో ఇప్పటికి 12 సార్లు దరఖాస్తు చేసుకున్నా. ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రజావాణిలో అర్జీ ఇచ్చా. ఇంకా పరిష్కారం కాలేదు’ అని కామారెడ్డి జిల్లా నందివాడకు చెందిన పొద్దుటూరి రాములు వాపోయారు. జిల్లా స్థాయిలో పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 


భూమి అమ్మాలనుకుంటే..

- డీకొండ లక్ష్మి, బ్రహ్మాజీవాడి, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా 

కుమార్తె వివాహం నిమిత్తం సాగుభూమిని విక్రయించాలనుకున్నా. ఆన్‌లైన్‌లో ఆధార్‌ లేని కారణంగా రిజిస్ట్రేషన్‌ కాలేదు. దీంతో అప్పుతెచ్చి పెళ్లి చేశా. ఆధార్‌ కార్డు యాక్టివేషన్‌ నిమిత్తం హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలో నాలుగుసార్లు దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని