Uttam Kumar Reddy: భారాస హయాంలో నీటిపారుదల ఛిన్నాభిన్నం

గత భారాస ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Published : 14 Jun 2024 05:47 IST

రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ల రీడిజైన్‌లతో రూ.20 వేల కోట్ల దుర్వినియోగం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు
ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి సీతారామ, సీతమ్మసాగర్‌ల సందర్శన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరంలోని పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల తదితరులు

ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: గత భారాస ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రూ.2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను సీతారామ, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులుగా రీడిజైన్‌ చేయటంతో సుమారు రూ.20 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని సీతారామ, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులను గురువారం ఆయన సందర్శించారు. ములకలపల్లిలోని పంప్‌హౌస్‌-3లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ నిర్మాణానికి స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులను పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. లింక్‌ కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారాస దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై రూ.8 వేల కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. తుమ్మల మాట్లాడుతూ.. 1997-98లో దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరిట పనులు ప్రారంభమై.. వైఎస్‌ హయాంలో ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుగా మారి, భారాస పాలనలో సీతారామ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుందని వివరించారు. గతంలో రూ.400 కోట్లతో ప్రారంభమైన పనుల అంచనా వ్యయం రీడిజైన్‌తో రూ.20 వేల కోట్లకు పెరిగిందన్నారు. పొంగులేటి మాట్లాడుతూ.. సీతమ్మసాగర్‌ జలాశయం నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రయల్‌రన్‌ కంటే ముందే కెనాల్‌ అక్కడక్కడ కొట్టుకుపోయిందన్నారు. మంత్రుల వెంట ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, మాలోత్‌ రాందాస్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని