Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 17 Jun 2024 06:17 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఉన్నతాధికారులు, న్యాయవాదులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌ ముందు బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చేవరకు 50 శాతం వాటా కోసం ప్రయత్నించాలన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్ల ముందు ఉన్న అంశాలపై సీనియర్‌ న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో సీనియర్‌ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినట్లు తెలిపారు. కృష్ణా జలాల సాధనలో ప్రజాప్రయోజనాలే కీలకమని.. దీనికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్‌ అవార్డు అంశాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలతో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మేలని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి.. మహారాష్ట్ర, కర్ణాటకలతో చర్చలు జరిపేందుకు నీటిపారుదల శాఖకు అనుమతి ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని