Vegetables rates: కూరగాయల ‘ధర’దడ

ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్‌ నగరానికి రోజూ ఎనిమిది వేల క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో ఆరు నెలలుగా కిలో రూ.20 చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి.

Updated : 14 Jun 2024 09:04 IST

పదిహేను రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు
రైతుబజార్లతో పోలిస్తే మార్కెట్‌లో 60% వరకు అధికం
ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు
స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు
ఈనాడు - హైదరాబాద్‌

ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్‌ నగరానికి రోజూ ఎనిమిది వేల క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో ఆరు నెలలుగా కిలో రూ.20 చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఐదారు వేల క్వింటాళ్లే వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకు సరకు వస్తే కిలో రూ.20 నుంచి రూ.25 వరకే దొరుకుతాయని అంటున్నారు.

సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. వర్షాకాలం మొదలవగానే మళ్లీ తగ్గుతుంటాయి. ఇది ఏటా సహజమే. కానీ, ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక... పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30% నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి. మే 20న కిలో ఉల్లి ధర రూ.20 పలికింది. ఇప్పుడది రూ.40కి చేరింది. టమాటా జూన్‌ ఆరంభంలో రూ.25 ఉండగా... ప్రస్తుతం రూ.50కి చేరింది. వంకాయ రూ.40, పచ్చిమిర్చి కిలోకి రూ.80 అయింది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాలతోపాటు పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. 

రాష్ట్రంలో 3.11 లక్షల ఎకరాల్లోనే సాగు 

తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా... అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. 

త్వరగా కుళ్లిపోతుండటంతో సమస్య 

ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. డిమాండ్‌కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్దఎత్తున దిగుమతి చేసుకున్నారు. దాంతో మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి.ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో వానల కారణంగా తడిసిపోయి, అతి త్వరగా కుళ్లిపోతుండటంతో వ్యాపారులు దిగుమతులను తగ్గించారు. హైదరాబాద్‌ మహానగర జనాభాకు నిత్యం దాదాపు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. వారం రోజులుగా అన్ని హోల్‌సేల్‌ మార్కెట్లకు 2,800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. 

మన పంటలు వచ్చాకే ఊరట 

మన రాష్ట్రంలో నెల రోజుల కిందట బావులు, బోర్ల కింద కూరగాయల పంటలను వేశారు. ఈ నెలాఖరుకు వాటి నుంచి కొంతమేరకు దిగుబడులు వచ్చే వీలుంది. ఎప్పటి మాదిరిగానే వర్షాకాలం సీజన్‌ పంటల సాగు కూడా మొదలైంది. వీటి దిగుబడులు జులై, ఆగస్టు నెలల్లో వచ్చే అవకాశముంది. ఆయా ఉత్పత్తులు మార్కెట్లలోకి వస్తే ధరలు తగ్గుతాయని మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. 


మాపై పెనుభారం పడుతోంది

కూరగాయల ధరల పెరుగుదలతో మాపై పెనుభారం పడుతోంది. నియంత్రణకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను అమలు చేయాలి. ధరల పెరుగుదలను అంచనా వేసి, ఆ మేరకు నిల్వలను అందుబాటులోకి తేవాలి.

సీహెచ్‌ రాము, వినియోగదారుడు, మియాపూర్‌


బీన్స్, క్యారట్‌ కొనడం లేదు

కూరగాయల ధరలు పెరిగి మాకు కూడా నష్టం వస్తోంది. బీన్స్, క్యారట్‌ వంటివాటిని ఎవరూ కొనడం లేదు. దీంతో అవి కుళ్లిపోతున్నాయి. ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతున్నాయి. 

అంజమ్మ, కూరగాయల విక్రేత, మోండా మార్కెట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని