Chandrababu: ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం

2047కి భారత్‌దేశం ప్రపంచంలోనే నంబర్‌-1గా ఉంటుంది. అందులో నంబర్‌ 1 కమ్యూనిటీగా తెలంగాణ, ఏపీలలోని తెలుగుజాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు అగ్రగామిగా నిలవాలి.

Published : 08 Jul 2024 03:35 IST

గొడవలతో అభివృద్ధికి ఆటంకం
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే.. నష్టమే ఎక్కువ
ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాగా పనిచేస్తున్నారు
ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం
కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు

జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకు పోటీపడుతున్న అభిమానులు

2047కి భారత్‌దేశం ప్రపంచంలోనే నంబర్‌-1గా ఉంటుంది. అందులో నంబర్‌ 1 కమ్యూనిటీగా తెలంగాణ, ఏపీలలోని తెలుగుజాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు అగ్రగామిగా నిలవాలి. అందులో 30-35శాతం మంది తెలుగువారు చోటు సాధించాలి. తెలుగువారు గ్లోబల్‌ లీడర్లుగా, అగ్రగాములుగా ఉండాలి.

ఏపీ సీఎం చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌: ఇటు తెలంగాణ, అటు ఏపీ.. తనకు రెండు కళ్ల లాంటివని, తన చివరి రక్తపుబొట్టు వరకు తెలుగుజాతి ప్రయోజనాలు కాపాడుతూ, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, అందరి మనోభావాల్ని గౌరవిస్తూనే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఇటీవల ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆదివారం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేల మంది కార్యకర్తలతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌  భవన్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ... తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం వస్తుందని... ఏపీలో పార్టీ విజయానికి తెతెదేపా శ్రేణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేశాయని అన్నారు. ‘తమ్ముళ్లూ.. తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ ఉండాలా? వద్దా? తెలుగువారి ప్రయోజనాల కోసం తెదేపా ఉండాలా? లేదా’ అని అడిగారు. ‘తొందరలోనే తెలంగాణలో తెదేపాను పునర్నిర్మిస్తా. యువకుల్ని ప్రోత్సహిస్తాం. 30-40 ఏళ్ల పాటు పార్టీకి పనిచేసే సమర్థ నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం. త్వరలోనే నేను మళ్లీ హైదరాబాద్‌కు వస్తా. పార్టీ ఆఫీసులో సమయం ఇస్తా. మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. నన్ను అకారణంగా జైల్లో పెడితే ఆరోజు హైదరాబాద్‌లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను’’ అని అన్నారు.

తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధితో గణనీయంగా పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం 

‘‘తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. అందుకు కారణం తెదేపా హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి. ఆ తర్వాత పదేళ్ల చొప్పున పాలించిన కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు కొనసాగించాయి. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732. గుజరాత్, మహారాష్ట్ర కంటే ఎక్కువ. ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518. తెలంగాణకు మంచి బేస్‌ వచ్చింది. తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఇక్కడి పాలకులకు అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాగా పనిచేస్తున్నారు. 

తెలుగుజాతి ప్రయోజనాల కోసం పనిచేయాలి

తెలుగు రాష్ట్రాల ప్రజలం అన్నదమ్ములుగా కొనసాగుతాం. కొందరు గొడవలు పడాలంటున్నారు. కానీ గొడవ పడితే నీళ్లు రావు. పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కలిసి సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. తెలుగుజాతి ప్రయోజనాల విషయంలో అందరం కలిసి పనిచేయాలి. శనివారం నాటి సీఎంల సమావేశంలో అధికారులతో కమిటీలు వేసుకున్నాం. రెండు రాష్ట్రాల సమస్యల్ని రానున్న రోజుల్లో ఒక దారికి తెస్తాం. గతంలో నేను చేసిన అభివృద్ధిని కొందరు వక్రీకరించారు. మొత్తం హైదరాబాద్‌ని అభివృద్ధి చేసినందుకే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందంటూ నాకు శాపనార్థాలు పెట్టారు. నేను ఆ రోజు, ఈ రోజు చెబుతున్నా.. ముందు ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. రాజధానితో అభివృద్ధి ప్రారంభమైతే మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుంది. 

విభజన కంటే.. విధ్వంసకర ప్రభుత్వంతో అధిక నష్టం 

2014లో విభజన నాటికి ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 35 శాతం ఎక్కువుంది. నేను ఏపీ సీఎంగా 2014-19 మధ్య బాగా కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించా. ఆ తర్వాత ఏపీలో విధ్వంసకర ప్రభుత్వం వచ్చింది. ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 44 శాతం ఎక్కువ అయింది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆ పాలన వల్ల నష్టం ఎక్కువ జరిగింది. ఈసారి ఏపీలో తెదేపా ప్రభుత్వ రాకపోయి ఉంటే.. తెలంగాణకు, ఏపీకి మధ్య తలసరి ఆదాయం 100 శాతం వ్యత్యాసం వచ్చేది. 

తెలుగువారి అదృష్టం ఎన్టీఆర్, పీవీ

తెలుగుగడ్డపై ఎన్టీఆర్, పీవీ నరసింహారావు పుట్టడం తెలుగువారి అదృష్టం. పటేల్, పట్వారీ, కరణం, మునసబు అనే భయంకరమైన వ్యవస్థను ఎన్టీఆర్‌ రద్దు చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం తమకు స్వాతంత్య్రం వచ్చిందని పండగ చేసుకుంది. దేశానికి దశ, దిశ చూపించిన వ్యక్తి పీవీ.

రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం

రాజకీయం అంటే వ్యాపారాలు చేసుకోవడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం నిజమైన రాజకీయం. నేను సీఎం అయ్యాక.. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశా. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిద్దామని, వచ్చి కలుస్తానని తెలియజేశా. ఆయన సానుకూలంగా స్పందించారు. రేవంత్‌రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నదమ్ములు విడిపోయినప్పుడు చిన్నచిన్న సమస్యలు వస్తాయి. భావోద్వేగాలుంటాయి. కానీ ఇబ్బందులు శాశ్వతంగా ఉండొద్దు.

భూమ్మీద నడవాలని మా మంత్రులకు చెబుతున్నా

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. పార్టీ చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మా మంత్రులకు ఒకటే చెబుతున్నా.. విర్రవీగవద్దని, భూమ్మీద నడవాలని, ప్రజలకు సేవకులమే కానీ పెత్తందార్లం కాదని హితబోధ చేస్తున్నా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని నేను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ బేషరతుగా వచ్చి తెదేపాతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత భాజపా ముందుకు వచ్చింది. ఏపీని పునర్నిర్మాణం చేయాలనుకున్నాం. ఏపీలో ఉన్నది సైకోనే కాదు.. అదో భూతం కూడా. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రమ్మని కొందరిని అడిగితే.. ‘మీ మీద మాకు నమ్మకం ఉంది. మీకు ట్రాక్‌ రికార్డుంది. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. మీ ప్రజలు మళ్లీ ఎప్పుడైనా ఆలోచిస్తే- మళ్లీ ఆ భూతం ముందుకు వస్తే మేం ఏం అవుతాం’ అని అడుగుతున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటానని నేను వాళ్లకు చెప్పా. రాజకీయాల్లోకి అర్హతలేని వారు వస్తే ఏం జరుగుతుందో ఆ రాష్ట్రంలో గత ఐదేళ్లు నిదర్శనంగా నిలిచింది. రాజకీయాల్లో మంచి వాళ్లు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం ఏపీలో ఇప్పుడు నాకు వచ్చింది. ఏపీలో నాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఈరోజే అన్నీ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. సమస్యల సుడిగుండంలో ఉన్నాం. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం. అక్కడ కోకొల్లలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. ముందు అక్కడ సెట్‌ చేసి మీ దగ్గరకు వస్తా’’ అని చంద్రబాబు తెతెదేపా శ్రేణుల్ని ఉద్దేశించి అన్నారు. జై తెలుగుదేశం.. జైతెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగానికి ముందు ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంతకుముందు తెతెదేపా రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావుతో ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కార్యక్రమంలో తెతెదేపా నేతలు బక్కని నర్సింలు, అరవింద్‌కుమార్‌గౌడ్, నందమూరి సుహాసిని, జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి, కాశీనాథ్, ప్రేంకుమార్‌జైన్, బంటు వెంకటేశ్వర్లు, సామ భూపాల్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగుజాతి.. ఏ నాయకుడికీ ఇవ్వనన్ని  అవకాశాల్ని నాకు ఇచ్చింది. సమైక్యరాష్ట్రంలో 9.5 ఏళ్లు సీఎంను, పదేళ్లు ప్రతిపక్షనేతను.  నా రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు. నాకు    పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే   పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నా. 

ఏపీ సీఎం చంద్రబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని