వందేభారత్ రైళ్లు మనకెప్పుడు?.. రాజధాని, శతాబ్ది రైళ్లలోనూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ (ట్రైన్‌ 18) రైళ్లు ఒక్కోటి పట్టాలు ఎక్కుతున్నాయి. ఇప్పటికే నాలుగు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, అయిదో రైలుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది.

Updated : 22 Oct 2022 10:20 IST

ఉత్తరాదికి, ఎన్నికల రాష్ట్రాలకే  కేటాయింపు

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ (ట్రైన్‌ 18) రైళ్లు ఒక్కోటి పట్టాలు ఎక్కుతున్నాయి. ఇప్పటికే నాలుగు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, అయిదో రైలుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. భారతీయ రైల్వేకి అత్యధిక ఆదాయాన్నిచ్చే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వేకి మాత్రం ఈ రైలు కేటాయింపుల్లో ఎదురుచూపులే మిగులుతున్నాయి. జోన్‌ నుంచి రైల్వేబోర్డుకి అసలు ప్రతిపాదనలు పంపారా? అనే విషయంలోనూ ఇక్కడి అధికారులు పెదవి విప్పడంలేదు. ఉత్తరాది రాష్ట్రాలకు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే వందేభారత్‌ రైళ్లు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు ప్రయాణికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

డిమాండ్‌ ఉన్నా..

ద.మ.రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌, కోల్‌కతా, గుహవాటి, చెన్నై, బెంగళూరు, మైసూర్‌, పుణె, ముంబయి, వారణాసి, దిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం పెద్దసంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలు వీక్షించేందుకు, ఇతర అవసరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతుంటారు. ఇతర నగరాల నుంచి వైద్య చికిత్సలు, వ్యాపారం, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ సికింద్రాబాద్‌కు వేగవంత రైళ్లు దక్కట్లేదు. శతాబ్ది, రాజధాని వంటి రైళ్ల కేటాయింపులోనూ జోన్‌కు అన్యాయం జరిగింది.

హిమాచల్‌ప్రదేశ్‌కూ మన కంటే ముందు

దేశంలోని చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ ఒకటి. రైల్వేనెట్‌వర్క్‌ కేవలం 312 కిలోమీటర్లే. అయినా ఇక్కడి అంబ్‌ అందౌరా నుంచి దిల్లీకి వందేభారత్‌ రైలును ఇటీవల ప్రారంభించారు. 3,965 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు గానీ, 1,828 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న తెలంగాణకు గానీ వందేభారత్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కలేదు.

* గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి అహ్మదాబాద్‌ మీదుగా ముంబయికి, అంతకుముందు న్యూదిల్లీ- కాట్రా, న్యూదిల్లీ- వారణాసి మధ్య వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కాయి. అయిదో వందేభారత్‌ రైలు నవంబరు 10న పట్టాలెక్కనుంది. మైసూర్‌ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ఇది రాకపోకలు సాగించనుంది.

రైలులో బెంగళూరా?

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు 9-9.30 గంటల్లో చేరుకుంటున్నారు. రైల్లో వెళితే 12 గంటలు పడుతుంది. దీంతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బస్సు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రూట్లో వందేభారత్‌ రైలు నడిపితే ప్రయాణ సమయం 3 గంటలకుపైగా తగ్గుతుంది. ఉదాహరణకు దిల్లీ- చండీగఢ్‌కు ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 4-5 గంటలు పడుతుంటే వందేభారత్‌ 2.50 గంటల్లోనే చేరుతుంది.

వందేభారత్‌ ప్రత్యేకతలు ఇవీ

దేశవ్యాప్తంగా దశలవారీగా 400 వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160-180 కి.మీ. 52 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. ఆటోమెటిక్‌ డోర్లు ఉంటాయి. సీట్లు సౌకర్యవంతంగా, కావాల్సినవైపు తిప్పుకునేలా ఉంటాయి. ప్రస్తుతం శతాబ్ది రైళ్ల తరహాలో కూర్చుని మాత్రమే ప్రయాణించే కోచ్‌లతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. స్లీపర్‌ బెర్తులతో వందేభారత్‌ కోచ్‌లను సైతం తయారుచేస్తున్నట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌-విశాఖపట్నం, హైదరాబాద్‌-తిరుపతి, హైదరాబాద్‌-బెంగళూరు మార్గాల్లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేళపెట్టాలని, తొలుత ఏదో ఒక మార్గంలో ఒక రైలును ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల కోరారు.

దేశవ్యాప్తంగా 25 రాజధాని రైళ్లు తిరుగుతుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటే ఉంది. సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లే ఈ రైలు తిరిగేది వారానికి ఒక్క రోజు మాత్రమే. శతాబ్ది రైళ్లు 60 ఉంటే ద.మ.రైల్వేకి ఒక్కటి కూడా లేదు. పుణె - సికింద్రాబాద్‌ మధ్య ఒక రైలు తిరుగుతున్నా అది సెంట్రల్‌ జోన్‌ రైలు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని