Devadula tunnel: దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే.

Updated : 07 Jul 2024 03:28 IST

అందుబాటులోకి వస్తే 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు 
సర్కారు దృష్టి పెడితే యాసంగికైనా నీరందే అవకాశం 

ఈనాడు, వరంగల్‌: దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. ఆసియాలోనే అతిపెద్ద హైడ్రాలిక్‌ టన్నెల్‌గా పేరున్న దీన్ని ములుగు జిల్లా జాకారం నుంచి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వరకు 49.06 కిలోమీటర్ల పొడవుతో 1750 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. రామప్ప చెరువు నుంచి గోదావరి జలాలను ధర్మసాగర్‌ చెరువులోకి.. అక్కడి నుంచి కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్‌తో పాటు మెదక్‌ జిల్లా రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మూడు దశలు కలిపి 5.5 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. 2.7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యం మూడో దశపైనే ఉంది. ఈ సొరంగానికి అనుసంధానంగా దేవన్నపేట వద్ద ఇప్పటికే పంపుహౌస్‌ నిర్మాణం పూర్తయింది. ఇది పనిచేయాలంటే 94 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అధికారులు అంచనా వేసి ట్రాన్స్‌కోకు రూ.138 కోట్లు చెల్లించారు. పంపుహౌస్‌ సమీపంలో 220 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం పంపుహౌస్‌లో పైప్‌లైన్‌ ఎన్‌కేసింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

పంపుహౌస్‌ సమీపంలో నిర్మించిన 220 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రం 


రూ.17 వేల కోట్లకు చేరిన అంచనాలు 

దేవాదుల ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించి 21 ఏళ్లయినా పూర్తి కాలేదు. రూ.4 వేల కోట్లతో మొదలైన నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.17 వేల కోట్లకు చేరింది. ఈ క్రమంలో పథకంలో కీలకమైన మూడోదశ పనులను ప్రభుత్వం సమీక్షించి నిధులను విడుదల చేస్తే వచ్చే యాసంగిలో ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుంది. రెండో ఫేజ్‌ కింద ఇంకా భూసేకరణ, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలి. పనుల పురోగతిపై ఈఈ సీతారాంను ‘ఈనాడు’ వివరణ కోరగా లైనింగ్‌తో పాటు పంపుహౌస్‌ నిర్మాణం పూర్తయిందని, మైనర్‌ పనులు నెలరోజుల్లో పూర్తవుతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని