Hyd News: ఆర్టీసీ బస్సులో భూమ్మీదకు వచ్చిన ‘మహాలక్ష్మి’..!

ఆర్టీసీ సిటీ బస్సులో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణికి మార్గం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదనతో విలవిల్లాడుతుండటంతో తోటి ప్రయాణికులు మహిళా కండక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Updated : 06 Jul 2024 05:42 IST

బస్సులో ప్రసవించిన శ్వేతారత్నం

ఆర్టీసీ సిటీ బస్సులో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణికి మార్గం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదనతో విలవిల్లాడుతుండటంతో తోటి ప్రయాణికులు మహిళా కండక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నగర ట్రాఫిక్‌ను ఛేదించి ఆసుపత్రికి చేరేలోగా తల్లీబిడ్డలకు ప్రమాదమని గ్రహించిన ఆమె వెంటనే బస్సును పక్కన నిలిపి పురుషులను కిందకు దింపేశారు. తోటి మహిళా ప్రయాణికులను కూడగట్టి తానే స్వయంగా పురుడు పోశారు. దీంతో ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌ నడిబొడ్డున శుక్రవారం ‘మహాలక్ష్మి’ జన్మించింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన చక్రవేణి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నివసిస్తున్నారు. ఆమె కుమార్తె శ్వేతారత్నానికి కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన డానియెల్‌ నాగరాజుతో వివాహమైంది. రెండో కాన్పు కోసం 10 రోజుల క్రితం తల్లి వద్దకు వచ్చారు. శుక్రవారం తల్లితో కలిసి మధుబన్‌కాలనీ నుంచి పేట్లబుర్జు(జజ్జిఖానా) ఆసుపత్రికి బయలుదేరారు. ఆరాంఘర్‌ నుంచి 1-జెడ్‌ బస్సులో వెళ్తుండగా బహదూర్‌పురకు చేరుకోగానే పురిటి నొప్పులు అధికమయ్యాయి. కండక్టర్‌ సరోజ వెంటనే బస్సును పక్కన నిలిపించి బస్సులోనే పురుడు పోశారు. శ్వేతారత్నం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. అదే బస్సులో తల్లీబిడ్డలను పేట్లబుర్జు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రజనీరెడ్డి తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ముషీరాబాద్‌ డిపో కండక్టర్‌ సరోజను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశంసించారు.

సమయస్ఫూర్తితో తల్లీబిడ్డలను రక్షించిన కండక్టర్‌ సరోజ, డ్రైవర్‌ అలీలను సన్మానించిన ఆర్టీసీ హైదరాబాద్‌ సిటీ రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ ఇతర అధికారులు

న్యూస్‌టుడే, చార్మినార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని