Teachers Promotion: తప్పుల తడకగా పదోన్నతుల జాబితా

స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో మంగళవారం గందరగోళం నెలకొంది.

Published : 19 Jun 2024 06:09 IST

విద్యాశాఖ పంపిన జాబితాతో ఆదిలాబాద్‌లో ఉత్తర్వులు జారీ
ఆ తర్వాత నిలిపివేయాలని ఆదేశాలు
జాబితా పరిశీలన సాగుతోందన్న ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో మంగళవారం గందరగోళం నెలకొంది. మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాలి. ఆ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటాక పదోన్నతుల జాబితాను పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు పంపారు. వాటిని పరిశీలించి సక్రమంగా ఉంటేనే వారు ఉత్తర్వులు జారీ చేయాలి. ఆదిలాబాద్‌ జిల్లాలో మంగళవారం ఉదయం 6.30 గంటలకే జాబితాకు అక్కడి డీఈవో ఆమోదం తెలిపి, పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇతర జిల్లాలకు అందిన జాబితాను పరిశీలించిన డీఈవోలు అందులో పలు తప్పులను గుర్తించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో... ఉత్తర్వులను జారీ చేయొద్దని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా డీఈవోలు వాటిని పెండింగ్‌లో పెట్టారు. అప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో 436 మందికిగాను 177 మంది పాత స్థానాల నుంచి రిలీవై కొత్త పాఠశాలల్లో చేరిపోయారు. మిగిలిన వారు కొత్త స్థానాల్లో చేరకుండా ఆగిపోయారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడికి రెండు పాఠశాలల్లో పోస్టింగ్‌ దక్కినట్లు తెలిసింది. అలాంటి తప్పుల కారణంగా పదోన్నతులు పొందే టీచర్ల జాబితాను మరింత సునిశితంగా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డీఈవోలను ఆదేశించారు. 

విద్యాశాఖ ఏం చేయబోతోంది...? 

ఒకవైపు డీఈవోలు పదోన్నతుల జాబితాను పరిశీలిస్తుండగా... మరోవైపు టెట్‌ విషయంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పదోన్నతులపై విద్యాశాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘‘పదోన్నతులపై హైకోర్టు స్టే ఇవ్వలేదు కదా... మరెందుకు ఆగిపోతాయి... ప్రక్రియ కొనసాగుతుంది’’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ఉపాధ్యాయ సంఘాల నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందా...? అని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని మంగళవారం విలేకరులు ప్రశ్నించగా ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనతో మాట్లాడి... అలాంటిది ఏమీలేదని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు అందాక వాటిలో  ఏముందో చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. భాషా పండితులు, పీఈటీలకు ప్రస్తుతం టెట్‌ అవసరం లేనందున వారికి పదోన్నతులు కల్పిస్తారా? అని ఒక అధికారిని ప్రశ్నించగా... టెట్‌ తప్పనిసరని న్యాయస్థానం తీర్పు ఇస్తే అప్పుడు వారి వరకు ఏం చేయాలనేది ఆలోచిస్తామని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని