Published : 24 Nov 2021 14:52 IST

viral video: ప్రమాదంలో పడ్డ మహిళను భలే కాపాడాడు!

వేగంగా వెళ్తున్న కారుకు తన కారును అడ్డుపెట్టిన డచ్‌వాసి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ మహిళను రోడ్డు ప్రమాదానికి గురికాకుండా ఒక వ్యక్తి కాపాడిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనకు నష్టం జరుగుతుంది, తన కారు ధ్వంసమవుతుందని తెలిసి కూడా ఏ మాత్రం సంకోంచించకుండా మానవత్వం చూపిన ఆ వ్యక్తి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. నెదర్లాండ్స్‌లోని నన్స్‌పీట్‌ ప్రాంతానికి చెందిన హెన్రీ.. రోజులాగే సాయంత్రవేళ కారులో ఇంటికి వెళ్తుండగా.. ఓ కారు అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లడం గమనించాడు. ఆ కారు డ్రైవింగ్‌ చేస్తోన్న మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయి.. రోడ్డు పక్కకి వెళ్లి.. మళ్లీ రోడ్డుపైకి వచ్చి ప్రమాదకరంగా ప్రయాణిస్తోంది.

పరిస్థితిని అర్థం చేసుకున్న హెన్రీ.. వెంటనే ఆమెను కాపాడేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఆ కారును తన కారును అడ్డుగా పెట్టి నిలువరించాడు. ఈ క్రమంలో రెండు కార్లు ఢీకొనడంతో హెన్రీ కారు వెనుకభాగం ధ్వంసమైంది. అయినా.. తన కారుకు జరిగిన నష్టం గురించి పట్టించుకోకుండా ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ మరో కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోను నెదర్లాండ్‌ మీడియా ప్రముఖంగా ప్రసారం చేయడంతో సోషల్‌మీడియాలోనూ వైరల్‌ అవుతోంది. అతడు చూపిన మానవత్వానికి, తెగువకి నెట్టింట్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, హెన్రీ మాత్రం ‘ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం మన బాధ్యత. నా వంతు బాధ్యత నేను నిర్వర్తించాను అంతే’అని అంటున్నాడు.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts