Viral Video: ఏనుగు ఎదురొచ్చినా.. ఆ డ్రైవర్‌ గుండె ధైర్యానికి అంతా ఫిదా!

అటవీ మార్గంలో ప్రయాణించే సమయాల్లో వన్యమృగాలు తారసపడటం, వాహనాలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలో ఈ బస్సు డ్రైవర్‌ని...

Published : 07 Apr 2022 01:53 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అటవీ మార్గంలో ప్రయాణించే సమయాల్లో వన్యమృగాలు తారసపడటం, వాహనాలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలో ఈ బస్సు డ్రైవర్‌ని చూసి నేర్చుకోవాల్సిందే! అడవి ఏనుగు మీదకు వచ్చినా జడవని అతని గుండె ధైర్యానికి నెటిజన్లతో పాటుగా ఓ ఐఏఎస్‌ అధికారి సైతం ఫిదా అయ్యారు. ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 

మంగళవారం సాయంత్రం కేరళకు చెందిన ఓ బస్సు మున్నార్‌కు ప్రయాణికులను చేరవేసేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ మూల మలుపులో అడవి ఏనుగు ఎదురైంది. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును అక్కడే నిలిపివేశాడు. ప్రయాణికులందరూ ఆ గజరాజును సెల్‌ ఫోన్‌లలో బంధించేందుకు పోటీపడ్డారు. ఒక్కసారిగా అది బస్సు వైపునకు రావడంతో అంతా నిశ్శబ్దమైంది. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. డ్రైవర్‌ సీటులో ఉన్న వ్యక్తి మాత్రం ఏమాత్రం జడవకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏనుగు తొండం పైకెత్తి వాహనాన్ని పరిశీలించినట్టుగా తడిమింది. దాని దంతాలు తగిలి అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అయినా అతడిలో ఏమాత్రం బెదురు కనబడలేదు. తరవాత అక్కడి నుంచి ఏనుగు పక్కకు తప్పుకోవడంతో మెల్లిగా బస్సును ముందుకు పోనిచ్చాడు. ఇదంతా అందులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు.

ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల అరుపులు, కేకలకు ఏనుగులు బెదిరిపోయి వారిపై దాడి చేస్తుంటాయి. వాటి ప్రవర్తనను అంచనా వేసిన ఆ డ్రైవర్‌ చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు అతడు ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. అపాయం కళ్ల ముందే ఉన్నా సమయస్ఫూర్తితో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తమిళనాడు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘ఇతనెవరో తెలియదు కానీ.. ‘మిస్టర్‌ కూల్‌’లా ఉన్నాడు.  బస్సును గజరాజు తనిఖీ చేయడం వీరిద్దరి మధ్య నిత్యకృత్యంగా అనిపిస్తుంది’’ అంటూ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని