Viral Video: ఫోన్‌ డేటా కోల్పోతే తిరిగి తెచ్చుకోగలం.. మరి ప్రాణాలు పోతే..!

‘రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయొద్దు ప్రాణాలు కోల్పోవద్దు’ అని పోలీసులు ఎంతలా హెచ్చరించినా కొంతమంది వాహనదారులు తమ పంథాను మార్చుకోవట్లేదు.

Published : 23 Jun 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయొద్దు ప్రాణాలు కోల్పోవద్దు’ అని పోలీసులు ఎంతలా హెచ్చరించినా కొంతమంది వాహనదారులు తమ పంథాను మార్చుకోవట్లేదు. సిగ్నల్‌ జంపింగ్‌, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌తో పాటు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇలాంటివారు తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై ఓ వ్యక్తి టూవీలర్‌ మీద పరిమితికి మించి లగేజీని తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీని మొత్తం స్కూటీపైనే తీసుకెళ్లాడు. కనీసం తాను కూర్చోడానికి స్థలం కూడా లేకుండా స్కూటీ మొత్తాన్ని లగేజీతో నింపి.. బైక్‌ చివర కూర్చొని చాలా ప్రమాదకరంగా వెళ్లాడు. అతను హెల్మెట్‌ ధరించాడు.. కానీ, అతని కాళ్లు మాత్రం రోడ్డుపైనే ఆనించి వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీనిని ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నా ఫోన్‌ 32జీబీ అయితే.. 31.9జీబీతో నిండి పోయింది’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. జాగ్రత్త అంటూ కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు అతని నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే.. ఈ వీడియోను తెలంగాణ స్టేట్ పోలీస్‌ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా షేర్‌ చేసింది. ‘‘మొబైల్‌ పాడైపోయినా తిరిగి డేటాను పొందవచ్చు. కానీ, ప్రాణాలు తిరిగిరావు. వాహనదారులూ మీ ప్రాణాలతో పాటూ ఇతరుల ప్రాణాలనూ ప్రమాదంలో నెట్టే ఇటువంటి రిస్క్‌ ప్రయాణాలు చేయకండి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటికే 7లక్షల మందికి పైగా వీక్షించగా.. 24వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని