Viral video: రియల్‌ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు

ప్రాణాలు లెక్కచేయకుండా ఓ యువకుడు చేసిన సాహసం ప్రశంసలందుకుంటోంది. విద్యుత్‌ షాక్‌తో విలవిల్లాడుతున్న ఓ ఆవును కాపాడి శెభాష్‌ అనిపించుకుంటున్నాడు........

Published : 05 Jul 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఓ యువకుడు చేసిన సాహసం ప్రశంసలందుకుంటోంది. విద్యుత్‌ షాక్‌తో విలవిల్లాడుతున్న ఓ ఆవును కాపాడి శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. అసలేం జరిగిందంటే.. పంజాబ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. మాన్సా జిల్లాలోని ఓ ప్రాంతంలో నీరు నిలిచిపోగా.. ఓ ఆవు అక్కడ సంచరిస్తూ కనిపించింది. అయితే అక్కడ నీటిలో ఉన్న ఓ స్తంభానికి విద్యుత్‌ సరఫరా అవుతుండగా.. దానికి సమీపంలోకి వెళ్లిన ఆ ఆవు విద్యుదాఘాతానికి గురైంది. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతూ నీటిలో కుప్పకూలింది.

అయితే దీన్ని గమనించిన ఓ దుకాణాదారుడు తన ప్రాణాలను లెక్కచేయలేదు. ఆవు విలవిల్లాడటం చూసి, షాక్‌ కొడుతుందని తెలిసి కూడా ధైర్యంతో నీటిలో దిగాడు. వెంట తీసుకెళ్లిన చిన్న గుడ్డను ఆవు రెండు కాళ్లకు చుట్టి దాన్ని వెనక్కి లాగాడు. దీన్ని గమనించిన మరో ఇద్దరు యువకుడు సైతం అతడికి సాయమందించడంతో ఆ ఆవు ప్రాణాలతో బయటపడగలిగింది. ఆ దుకాణాదారుడు స్పందించడం కాస్త ఆలస్యమైతే ఆ మూగ జీవి ప్రాణాలు పోయేవే. 

అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలను అనామికా జైన్‌ అనే యువతి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. ‘మానవత్వం అంటే ఇదే’, ‘అతడికీ విద్యుత్‌ షాక్‌ తగిలే ప్రమాదం ఉంది, అయినప్పటికీ అడుగు ముందుకేశాడు.. హాట్సాఫ్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోను ఇప్పటివరకు 1.2మిలియన్ల మంది వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని