Viral Video: కోళ్లు బండెక్కె.. చిన్నారి గుండె బరువెక్కె..!

తనెంతో ఇష్టపడే కోళ్లను తీసుకెళ్లిపోతుంటే ఓ పసి హృదయం తల్లడిల్లిపోయింది. తన కోళ్లను తనకు తిరిగిచ్చేయమంటూ ఆ చిన్నారి చేతులెత్తి వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 21 Jul 2021 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనెంతో ఇష్టపడే కోళ్లను తీసుకెళ్లిపోతుంటే ఓ పసి హృదయం తల్లడిల్లిపోయింది. తన కోళ్లను తనకు తిరిగిచ్చేయమంటూ ఆ చిన్నారి చేతులెత్తి వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మూగజీవాలపై ఎంతో ప్రేమను పెంచుకున్న ఆ బాలుడి రోదన చూసి నెటిజన్ల గుండెలు సైతం బరువెక్కాయి. సిక్కింలోని మెల్లి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడు పెంచుకుంటున్న కోళ్లను పౌల్ట్రీ ఫామ్‌కు తరలించేందుకు వాహనంలోకి ఎక్కించారు. తన కోళ్లను తీసుకెళ్లొద్దంటూ ఆ చిన్నారి ఏడవటం మొదలుపెట్టాడు. వాహనంలోని తన కోళ్ల వైపు చూపిస్తూ.. చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నాడు. అవి తిరిగి తన వద్దకు వస్తాయన్న ఆశతో వాటికి ఆ చిన్నారి చేతులతో సైగ చేస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం చూపరుల కంట తడి పెట్టించింది. వాహనం వెళ్లిపోయేవరకూ ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. రోడ్డుపైనే కింద కూర్చుని రోదిస్తూనే ఉన్నాడు. పిల్లాడి ఏడుపు ఆపడం కోసం చివరికి తండ్రి వచ్చి తనకు మరిన్ని కోడి పిల్ల్లలను కొనిస్తానని చెప్పినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు ఆ వీడియోను 2 లక్షల మందికి పైగా చూశారు. 20 వేల మంది లైక్‌ చేశారు. వీడియో చూసిన వారిలో కొందరు కామెంట్ల రూపంలో ఆ బాలుడికి పశుపక్ష్యాదులపై ఉన్న ప్రేమను ప్రశంసించారు.  

  
 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని