Viral video: ఊరేగింపు కార్లలో విన్యాసాలు.. వరుడికి పోలీసుల షాక్‌

జాతీయ రహదారిపై పెళ్లి ఊరేగింపు చేస్తూ విన్యాసాలకు పాల్పడ్డ వరుడితోపాటు అతడి మిత్రులకు పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. వరుడి కారు సహా.. మరో ఎనిమిది వాహనాలకు ఏకంగా రూ. 2లక్షల జరిమానా విధించారు.

Published : 16 Jun 2022 02:19 IST

లఖ్‌నవూ: జాతీయ రహదారిపై పెళ్లి ఊరేగింపు చేస్తూ విన్యాసాలకు పాల్పడ్డ వరుడితోపాటు అతడి మిత్రులకు పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. వరుడి కారు సహా.. మరో ఎనిమిది వాహనాలకు ఏకంగా రూ. 2లక్షల జరిమానా విధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించాడు. అయితే టాప్‌ లెస్‌ ఆడీ కారులోని వరుడు సహా, మరికొన్ని కార్లలోని అతడి మిత్రులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ నృత్యాలు చేస్తూ, విన్యాసాలకు పాల్పడ్డారు. కొందరు కార్లపై కూర్చోని సెల్ఫీలు దిగగా.. మరికొందరు కార్లకు ఇరువైపులా ఉండే కిటికీలపై వేలాడుతూ విన్యాసాలు చేశారు.

ముజాఫర్‌నగర్‌-హరిద్వార్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఊరేగింపునకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా (Viral video) మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తోటి ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా కొందరు ఇలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ముజఫర్‌నగర్‌ పోలీసులు వరుడు, అతడి మిత్రులపై చర్యలకు ఉపక్రమించారు. వరుడి కారుతో సహా ఊరేగింపులో పాల్గొన్న మరో ఎనిమిది కార్లను సీజ్‌ చేశారు. ఆ కార్ల యజమానులకు ఏకంగా రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని