Viral video: మొసలిని పెళ్లాడిన మేయర్‌.. అంగరంగవైభవంగా వేడుక!

ఓ మేయర్ ఏకంగా మొసలిని వివాహమాడి దానితో కలిసి నృత్యం చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి........

Published : 04 Jul 2022 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ మేయర్ ఏకంగా మొసలిని వివాహమాడి దాన్ని పట్టుకొని నృత్యం చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు వందల మంది అతిథులు హాజరయ్యారు. పెళ్లి కుమార్తె దుస్తుల్లో అందంగా ముస్తాబైన ఏడేళ్ల మొసలిని మేయర్‌ విక్టర్ హ్యూగో సూసా జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఈ వింత వివాహం మెక్సికోలోని ఓ గ్రామంలో జరిగింది. ఓక్సాకా రాష్ట్రం సాన్ పెడ్రో హువామెలులాలోని ఓ మత్స్యకార గ్రామం ఇందుకు వేదికైంది. తన ప్రాంత ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ వివాహం చేసుకున్నట్లు మేయర్‌ తెలిపారు.

మొసలిని వివాహమాడే సంప్రదాయం మెక్సికోలో పురాతన కాలం నుంచి వస్తోంది. మొసలిని వారు భూమాతగా, దేవతగా కొలుస్తారు. ఇలాంటి పెళ్లిళ్లను మనుషులకు, దేవతలకు మధ్య బంధంగా చూస్తారు. అందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గత గురువారం మొసలిని విక్టర్‌ మనువాడారు. అలా అని ఈ పెళ్లిని ఏదో తూతూమంత్రంగా జరిపించలేదు. వధువు మొసలికోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందించారు. దాన్ని అందంగా అలంకరించారు. నోరు కట్టేసి ఉన్న మకరాన్ని జాగ్రత్తగా పట్టుకుని వీధుల్లో ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు.

‘పుష్కలంగా వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంటలు పండాలని, నదిలో చేపలు బాగా దొరకాలని మేము ప్రకృతిని ప్రార్థిస్తున్నాం’ అని వివాహ మహోత్సవం సందర్భంగా విక్టర్ పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా మొసలిని వివాహమాడిన మేయర్.. దాన్ని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం ఆనందంతో నృత్యం, సంబురాలు చేసుకుంటున్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని