Viral Videos: వంతెనపై నిలిచిపోయిన రైలు.. లోకోపైలట్‌ సాహసం!

నడి వంతెనపై నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ఓ లోకోపైలట్‌ సాహసమే చేశారు! బోగీల కిందుగా ప్రమాదకర స్థితిలో పాకుతూ వెళ్లి.. దాన్ని పరిష్కరించారు...

Published : 20 Jun 2022 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నడి వంతెనపై నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ఓ లోకోపైలట్‌ సాహసమే చేశాడు! బోగీల కిందుగా ప్రమాదకర స్థితిలో పాకుతూ వెళ్లి.. దాన్ని పరిష్కరించారు. సంబంధిత వీడియోను రైల్వేశాఖ సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా లోకోపైలట్‌ ధైర్యసాహసాలను ప్రశంసించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘ప్రయాణికులకు ఎల్లవేళలా సేవలందించేందుకు రైల్వే ఉద్యోగులు కట్టుబడి ఉన్నారు. ఎయిర్‌ లీకేజీ సమస్యతో వంతెనపై నిలిచిపోయిన రైలును పునః ప్రారంభించేందుకు అసిస్టెంట్‌ లోకోపైలట్‌ గణేష్ ధైర్యసాహసాలు కనబర్చారు. బోగీల కిందుగా పాకుతూ వెళ్లి.. సమస్యను సరిదిద్దారు’ అని రైల్వేశాఖ ట్వీట్‌లో పేర్కొంది. అయితే, ఏ రైలు? ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది? తదితర వివరాలను ప్రస్తావించలేదు.

గత నెలలోనూ ముంబయి నుంచి బిహార్‌లోని ఛప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎమర్జెన్సీ చైన్‌ను లాగడంతో.. అది కాస్తా ఓ నది వంతెనపై నిలిచిపోయిన విషయం తెలిసిందే. అలారం చైన్‌ నాబ్‌ను రీసెట్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ సైతం ఇలాంటి సాహసమే చేశారు. వంతెనపై బోగీ కింది పరికరాలు, చక్రాల పక్కన సన్నని సందులోంచి లోపలికి వెళ్లి దాన్ని సరిచేశారు. ఆయన నిబద్ధతను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తోసహా సంబంధిత అధికారులు కొనియాడారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని