Viral video: నడుస్తున్న రైలు కింద మహిళ.. తాపీగా ఫోన్లో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మహిళ ఉన్నపళంగా రైల్వే ట్రాక్‌పై ప్రత్యక్షమైంది. అదే సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ రైలు కింద పడింది.

Published : 16 Apr 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే ట్రాక్‌లపై జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి ఘటనలు చూస్తూనే ఉన్నాం. వీటిని నివారించడానికి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు నిర్లక్ష్య ధోరణి వీడటంలేదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మహిళ ఉన్నపళంగా రైల్వే ట్రాక్‌పై ప్రత్యక్షమైంది. అదే సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ రైలు కింద పడింది. రైలు ఉపరితలానికి తగలకుండా ట్రాక్‌పై పడుకోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఫ్లాట్‌ఫామ్‌ పై నిల్చుని ఇదంతా చూసిన వారికి మాత్రం ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆమె క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరెవరైనా ఉంటే రైలు కూత చప్పుడుకే బెదిరిపోయేవారు. కానీ సదరు మహిళ మాత్రం తాపీగా పైకి లేచి అసలేమీ జరగనట్టుగా ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది.

ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తూ ‘‘ప్రాణాలకన్నా ఫోనే ముఖ్యం కదా మరి’’ అంటూ కామెంట్‌ను జోడించారు. నెటిజన్లు మాత్రం వీడియోలో కనిపిస్తున్న మహిళపై మండిపడుతున్నారు. ‘‘కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది’’ అని ఒకరు.. ‘‘ఆమె చెంప పగలగొట్టాల్సింది’’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత నిర్లక్ష్యమేమిటి ముందు ఆ మహిళను అరెస్టు చేయండి’’ అని ప్రధాన మంత్రి కార్యాలయానికి ట్యాగ్‌ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని