అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన బాతు సంచారం..

వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఇతర దేశాల నుంచి ఇక్కడికి పక్షులు వలస వస్తుంటాయి. ఇలా కొన్ని సందర్భాల్లో

Published : 07 Mar 2021 23:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఇతర దేశాల నుంచి ఇక్కడికి పక్షులు వలస వస్తుంటాయి. ఇలా కొన్ని సందర్భాల్లో భారత్‌లో కొత్తరకం పక్షులు కూడా దర్శనమిస్తుంటాయి. అయితే తూర్పు పాలియార్కిటిక్‌కు చెందిన ఓ అరుదైన బాతు అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ సరస్సులో కనిపించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ(ఎంఈఎఫ్‌సీసీ) ట్విటర్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి దేశీయ బాతులతో కలిసి మాండరిన్‌ బాతు నీటిలో సంచరిస్తున్న వీడియోను శాఖ ట్విటర్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కొత్త జాతి పక్షి ఇక్కడికి రావడం ఎంతో కనువిందుగా ఉందని ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ట్వీట్‌ చేశారు.

‘ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షి జాతుల్లో ఒక్కటైన ఈ మాండరిన్‌ బాతులు ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు సార్లు కనిపించాయి. ఈ మధ్య కాలంలో జైరోలోని సీఖే సరస్సులో ఈ రకం బాతు దర్శనమిచ్చింది. దిరంగ్ వ్యాలీలోని మియాంగ్ నదిలో మళ్లీ ఇప్పుడు కనిపించింది. వాటిని ఇక్కడ చూడటంతో మంచి అనుభూతి కలుగుతోంది’ అని సీఎం ట్వీట్‌ చేశారు.

వలస జీవనంలో భాగంగా మాండరిన్‌ బాతు ఇక్కడికి వచ్చినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. కాగా, ఈ రకం బాతులు ఇప్పుడు తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం... అడవుల నిర్మూలన వల్ల తూర్పు రష్యా, చైనాలలో వీటి సంఖ్య 1,000 జతల కన్నా తక్కువే ఉందని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని