తలకిందులైతే పొరపాటు లేదోయ్‌..!

వీడియో సమావేశాల్లో పొరపాట్లు సామాజిక మాధ్యమాల్లో ఫన్నీ వీడియోలుగా చలామణీ అవుతున్నాయి.

Published : 12 Feb 2021 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా మహమ్మారి దయ వల్ల ఉద్యోగాలు, సమావేశాలు ఆన్‌లైన్‌ విధానంలోకి మారాయి. విద్యార్థులు, ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ, న్యాయ, చట్టసభల సమావేశాలు కూడా వీడియో మాధ్యమాల ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరిగే పొరపాట్లు సామాజిక మాధ్యమాల్లో ఫన్నీ వీడియోలుగా చలామణీ అవుతున్నాయి. ఇటువంటిదే ఓ సంఘటన అమెరికా చట్ట సభ కాంగ్రెస్‌ సమావేశంలో చోటు చేసుకుంది. అది విపరీతంగా వైరల్‌ అవుతోంది.

అమెరికాలో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు టామ్‌ ఎమ్మర్‌, జూమ్ యాప్‌ ద్వారా కాంగ్రెస్‌ ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఐతే ఆయన పొరపాటున ఓ జూమ్‌ ఫిల్టర్‌ను ఆన్‌ చేయటంతో ఆయన చిత్రం తలకిందులుగా కనిపించసాగింది. ఆ సంగతి తెలియని ఎమ్మర్‌.. దేశంలో ఉద్యోగ భద్రతను గురించి సీరియస్‌గా మాట్లాడటం కొనసాగించారు. ఈలోగా సభ చైర్‌పర్సన్‌ మాక్సిన్‌ వాటర్స్‌ ఆయనను ఆపి.. ‘‘మిస్టర్‌ ఎమ్మర్‌, మీరు బాగానే ఉన్నారా?’’ అని ఆరా తీశారు. ఇంతలో మరో సభ్యుడు ఎమ్మర్‌ చిత్రం తలకిందులుగా కనిపిస్తున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. ఇందుకు ఎమ్మార్‌ స్పందిస్తూ.. దీనిని ఎలా సరిచేయాలో తెలియటం లేదనటంతో సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఆయన దాన్ని సరిచేశారు. ఈ మొత్తం ఉదంతం చట్టసభ సభ్యులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను కూడా కడుపుబ్బా నవ్విస్తోంది. ఒక్కరోజులోనే నాలుగు లక్షలకు పైగా లైక్స్‌ సంపాదించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

ఇవీ చూడండి..

దీదీపై మీమ్స్‌ వెల్లువ

తాడాటా.. తేలుతున్నారా?



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని