Emergency: వెంటాడుతున్న ఎమర్జెన్సీ పీడకల

దేశ చరిత్రలో ‘ఆత్యయిక పరిస్థితి’ ఒక చీకటి అధ్యాయం. 1975లో విధించిన ఎమర్జెన్సీకి ఇటీవలే 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా పార్లమెంటు లోపలే కాదు- బయట కూడా దానిపై చర్చ జరుగుతోంది. ఆత్యయిక పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి?

Updated : 04 Jul 2024 14:19 IST

దేశ చరిత్రలో ‘ఆత్యయిక పరిస్థితి’ ఒక చీకటి అధ్యాయం. 1975లో విధించిన ఎమర్జెన్సీకి ఇటీవలే 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా పార్లమెంటు లోపలే కాదు- బయట కూడా దానిపై చర్చ జరుగుతోంది. ఆత్యయిక పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి?

అంతర్గత కల్లోలం వల్ల భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ 1975 జూన్‌ 26న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 352(1) రాజ్యాంగ అధికరణ కింద ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) ప్రకటించారు. తిరిగి దాన్ని 1977 మార్చి 21న రద్దు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో పౌరులు తీవ్రమైన అణచివేతకు గురయ్యారు. సుమారు 1.5లక్షల మంది జైలుపాలయ్యారు. ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛ ఎమర్జెన్సీకి బలైపోయాయి. వివిధ హైకోర్టులు 226వ అధికరణను ఉపయోగించి పలువురిని జైలుపాలు కాకుండా కాపాడాయి. దానిపై కోపగించిన నాటి ప్రభుత్వం దాదాపు 16మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది.

రాజ్యాంగంలో మార్పులు

విదేశీ దురాక్రమణ, అంతర్గత ముప్పు సంభవించినప్పుడు ఆత్యయిక పరిస్థితిని విధించడానికి రాజ్యాంగం అనుమతిస్తోంది. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను 352-360 అధికరణల్లో పొందుపరచారు. 353వ అధికరణ ఎమర్జెన్సీ కాలంలో కేంద్రానికి ఉండే ప్రత్యేక అధికారాలను వివరిస్తోంది. 1975లో ఇందిరాగాంధీ అధికారం నుంచి దిగక తప్పదని తేలిపోవడంతో దాన్ని తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు. రాయ్‌బరేలీలో ఇందిరపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించడం ఎమర్జెన్సీకి దారితీసింది. యశ్‌పాల్‌ కపూర్‌ అనే గెజిటెడ్‌ అధికారి, పోలీసులు, జిల్లా మేజిస్ట్రేట్, ఇతర అధికారులు ఇందిర విజయానికి అక్రమ మార్గాల్లో తోడ్పడ్డారని రాజ్‌ నారాయణ్‌ ఆరోపించారు. ఓటర్లకు డబ్బు, రగ్గులు, మద్యం పంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో పరిమితికి మించి ఇందిర ఖర్చుపెట్టారని, వైమానిక దళ హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేశారని పిటిషనర్‌ ఆరోపించారు. రాజ్‌ నారాయణ్‌ ఆరోపణలతో ఏకీభవించిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్‌ సిన్హా- ఇందిర ఎన్నిక చెల్లదని తీర్పిచ్చారు. దాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేసి స్టే పొందారు. తరవాత సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసింది. ఆ తీర్పుతో జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా విభేదించారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును కాదని ఇందిర ప్రభుత్వం దేశంలో ఆత్యయిక స్థితి విధించింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ సవరణలతోపాటు పలు మార్పులు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించిన ఏడో షెడ్యూలునూ సవరించారు. ప్రాథమిక హక్కులకన్నా ప్రాథమిక బాధ్యతలే మిన్న అని చాటారు. న్యాయవ్యవస్థ అధికారాలను కుదించడం కోసం ట్రైబ్యునళ్ల పద్ధతిని ప్రవేశపెట్టినదీ ఎమర్జెన్సీ కాలంలోనే. చరిత్రను విస్మరించేవారు చారిత్రక తప్పిదాలను మళ్ళీమళ్ళీ చేస్తుంటారు. ఇలాంటివారు తరవాత పదవీచ్యుతులు కావడమో... హిట్లర్, ముసోలినీ, గడాఫీల మాదిరిగా హతమారడమో జరుగుతుంది. లేదంటే నెపోలియన్‌లా జైలుపాలవడమో, ఫెర్డినాండ్‌ మార్కోస్‌ మాదిరిగా దేశాన్ని వీడటమో జరుగుతుంది. అదీకాదంటే ఇందిరా గాంధీలా తదుపరి ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వస్తుంది. 

నేడూ అవే పోకడలు...

ఎమర్జెన్సీ గతించిన వ్యవహారమని చాలామంది పొరబడతారు.  ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఇప్పుడూ పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. నిరంకుశ పోకడలు తెచ్చిపెట్టే దీర్ఘకాల ప్రమాదాన్ని చాలామంది పౌరులు గుర్తించడంలేదు. పాలకులు, ప్రజలు ఎమర్జెన్సీ నేర్పిన పాఠాలను మరచిపోతున్నట్లుంది. ఉగ్రవాదులు, నగదు అక్రమ చలామణీదారులపై ప్రయోగించాల్సిన చట్టాలను పాలకులు తమకు గిట్టనివారిపై ఉపయోగించడం చూస్తున్నాం. పత్రికల గొంతు నొక్కుతున్న సందర్భాలెన్నో!  ప్రజాస్వామ్య సంస్థలకు చాప కింద నీరులా ఎసరుపెడుతున్నారు. గడచిన అయిదేళ్లలో పాలకుల భావజాలాన్ని వ్యతిరేకించేవారి అరెస్టులు పెరిగిపోయాయి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే పత్రికలపై విరుచుకుపడటమూ చూస్తున్నాం. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇటువంటి అరెస్టులు జరగలేదు. పౌరులు ఇలాంటి అఘాయిత్యాలను చూస్తూ మిన్నకుండిపోతే అది ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు తెచ్చిపెడుతుంది. ‘వాళ్లు ఇతరుల కోసం వచ్చారు కాబట్టి మనమేం మాట్లాడనక్కర్లేదు అని ఊరుకుంటే, రేపు మనకోసం వచ్చినప్పుడు మాట్లాడేవాళ్లే ఉండరు’ అని రెండో ప్రపంచ యుద్ధకాలంలో మార్టిన్‌ నీమోలర్‌ రాసిన కవితను అందరూ గుర్తుంచుకోవాలి. పౌరులు తమ హక్కులను కాపాడుకుంటూ పాలకుల నుంచి మరింత జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేయాలి. లేదంటే అప్రకటిత ఎమర్జెన్సీలను భరించక తప్పదు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.