Cancer: క్యాన్సర్‌కు ముకుతాడు ఎలా?

మహమ్మారి వ్యాధి నుంచి దేశానికి విముక్తి కలిగించాలనేది క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ లక్ష్యం. క్యాన్సర్‌ నిపుణులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ సహాయ కేంద్రానికి సందేహ నివృత్తి కోసం ఫోన్‌ చేసినవారిలో యువత సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తేలింది.

Published : 14 Jun 2024 01:12 IST

మహమ్మారి వ్యాధి నుంచి దేశానికి విముక్తి కలిగించాలనేది క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ లక్ష్యం. క్యాన్సర్‌ నిపుణులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ సహాయ కేంద్రానికి సందేహ నివృత్తి కోసం ఫోన్‌ చేసినవారిలో యువత సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తేలింది. యువతలో క్యాన్సర్లు పెరిగిపోవడంపై పాలకులు దృష్టి సారించాల్సిందే. ఎందుకంటే, దేశంలో సగానికిపైగా 35 ఏళ్లలోపువారే!

దేశ యువతలో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుండటం ఆందోళనకరం. క్యాన్సర్‌ బాధితుల్లో తమ జబ్బుపై రెండో అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ సహాయ కేంద్రానికి ఫోన్‌ చేసిన వారిలో 20శాతం దాకా 40 ఏళ్లకంటే తక్కువ వయసు వారేనని తేలింది. రెండున్నర నెలల వ్యవధిలో 1368 మంది ఫోన్‌ చేయగా, నలభైఏళ్లలోపు వయసున్న క్యాన్సర్‌ రోగుల్లో అరవై శాతం పురుషులే. హైదరాబాద్, మేరఠ్, ముంబయి, దిల్లీల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫోన్లు వచ్చినట్లు ఫౌండేషన్‌ వెల్లడించింది. తల, మెడ, రొమ్ము, పేగు క్యాన్సర్లు ప్రబలంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. సరైన అవగాహన, పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో అరవై శాతానికి పైగా క్యాన్సర్లు వెంటనే వెలుగులోకి రావడం లేదు.

అలవాట్లే కారణం

స్థూలకాయం పలురకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలామందిలో ఎత్తూబరువుల నిష్పత్తి(బీఎంఐ) అత్యధికంగా ఉంటోంది.  యువతలో ప్రాణాంతక వ్యాధులు పెచ్చరిల్లడానికి అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచీకరణ, పట్టణీకరణ కారణంగా ఇటీవలి కాలంలో భారత్‌లో ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని యువత పాశ్చాత్య ఆహార అలవాట్లలో భాగంగా శుద్ధి చేసిన, ప్యాకేజ్డ్‌ ఆహారం, శీతలపానీయాలు, అధిక కొవ్వుండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటోంది. వీటివల్ల మధుమేహం, గుండెజబ్బులు, ఊబకాయం సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. చాలామంది యువతలో మద్యపానం, ధూమపానం పెరుగుతున్నాయి. ఈ వ్యసనాల్ని నిరోధించేందుకు ఎన్ని ప్రయత్నాలు సాగుతున్నా ఫలితం ఉండటం లేదు. మద్యపానం, పొగాకు నమలడం, ధూమపానం వంటివి కాలేయ వ్యాధులు, గుండెజబ్బులకు దారితీస్తున్నాయి. వ్యాధిని సకాలంలో నిర్ధారించలేకపోవడం, కొన్నిసార్లు వ్యాధినే గుర్తించలేకపోవడంతో జబ్బు ముదిరి, చికిత్స సైతం క్లిష్టతరమవుతోంది. మానసిక ఒత్తిడి, ప్రత్యామ్నాయ చికిత్సలు లేకపోవడం, అధిక వ్యయాలు వంటివీ సమస్యగా పరిణమించాయి. జబ్బును ప్రారంభ దశలోనే గుర్తించడం, అందరికీ నాణ్యమైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం, సరైన సహాయక సేవలు అందించగలిగితే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. చాలామంది చిన్నవయసులో క్యాన్సర్‌ రాదనుకుంటారు. ఇది ఎవరిపైన అయినా దాడి చేయవచ్చు. కొన్నిసార్లు సాధారణ పరీక్షల్లో జబ్బును గుర్తించలేకపోవచ్చు. తీవ్రస్థాయికి చేరిన తరవాత వ్యాధి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటే ప్రాణాంతకంగా మారుతుంది.

ఆర్థిక భారం

క్యాన్సర్‌ అంటే ప్రాణాంతకమని, చికిత్సే కష్టమనే అపోహలు జనంలో నెలకొన్నాయి. క్యాన్సర్‌కూ విజయవంతంగా చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది చికిత్స తరవాత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. వ్యాధిని జయించేవారి సంఖ్య గత నలభై ఏళ్లలో అధికమైంది. దేశంలో పెరుగుతున్న స్థూలకాయం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ప్రత్యేకంగా అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం, శ్రమలేని జీవన శైలి వంటివి క్యాన్సర్ల పెరుగుదలకు దారితీస్తున్నాయి. యువత క్యాన్సర్‌ ముప్పును తప్పించుకోవాలంటే పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు పదార్థాలు, శుద్ధిచేసిన ఆహారం తగ్గించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చని, రోజువారీ జీవితంలో స్వల్ప మార్పులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని, సంపూర్ణ ఆరోగ్యంతో ముందడుగు వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, క్యాన్సర్‌ రోగుల్లో 67శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు విదితమవుతోంది. క్యాన్సర్లు పేదలు, మధ్యతరగతి ప్రజలనూ కబళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడం ద్వారా ఆర్థిక భారం భరించలేక బాధితుల కుటుంబాలు అప్పులపాలై, రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి.

 శ్రీనివాస్‌ దరెగోని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.