Black Sea: నల్ల సముద్రంలో చైనా ప్రాబల్యం

చైనా నుంచి కజక్‌స్థాన్, కాస్పియన్‌ సముద్రం, అజర్‌బైజాన్, జార్జియా మీదుగా ఐరోపా చేరుకోవడానికి ‘మిడిల్‌ కారిడార్‌’ను నిర్మించ తలపెట్టారు. అందులో భాగంగా జార్జియాలోని నల్ల సముద్రంలో నిర్మించే అనక్లియా ఓడరేవు అత్యంత కీలకమైనది. దాని నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్టును చైనా, సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఇటీవల చేజిక్కించుకొంది.

Published : 07 Jul 2024 00:47 IST

చైనా నుంచి కజక్‌స్థాన్, కాస్పియన్‌ సముద్రం, అజర్‌బైజాన్, జార్జియా మీదుగా ఐరోపా చేరుకోవడానికి ‘మిడిల్‌ కారిడార్‌’ను నిర్మించ తలపెట్టారు. అందులో భాగంగా జార్జియాలోని నల్ల సముద్రంలో నిర్మించే అనక్లియా ఓడరేవు అత్యంత కీలకమైనది. దాని నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్టును చైనా, సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఇటీవల చేజిక్కించుకొంది. దాంతో అక్కడి భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

జార్జియాలోని అనక్లియా రేవు నిర్మాణం పూర్తయితే దక్షిణ కాకసస్‌ ప్రాంతంలో చైనాకు గట్టి పట్టు చిక్కుతుంది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం 1992లో ఆ ప్రాంతంలోని ఆర్మీనియా, అజర్‌బైజాన్, జార్జియాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఆ క్రమంలో అక్కడ పైచేయి సాధించడం కోసం  అమెరికా, ఐరోపా సమాఖ్యకు రష్యాకు మధ్య చాలాకాలంపాటు ఆధిపత్య పోరు సాగింది. జార్జియా దక్షిణ కాకసస్‌ ప్రాంతంలో చాలా చిన్నదే అయినప్పటికీ, అత్యంత కీలకమైనది. ఇది సరిగ్గా తూర్పు, పడమర కూడలిగా భావించే ప్రాంతంలో విస్తరించి ఉన్నది. దక్షిణ కాకసస్‌ ప్రాంతంలో నల్ల సముద్రం మీదుగా వెళ్ళడానికి అవకాశమున్న ఏకైక దేశమిదే. పైగా అజర్‌బైజాన్‌ నుంచి తుర్కియే, ఐరోపాలకు చమురు, సహజ వాయువుల రవాణాకు తోడ్పడుతుంది. అందుకనే మిడిల్‌ కారిడార్‌ ప్రాజెక్టులో జార్జియా ప్రాధాన్యం సంతరించుకొంది.

మారిన జార్జియా వైఖరి...

చారిత్రకంగా పరిశీలిస్తే, జార్జియా స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి నాటో, ఈయూలకు అనుకూలమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. దాంతో పొరుగున ఉన్న రష్యాతో దాని సంబంధాలు క్షీణిస్తూ  వచ్చాయి. జార్జియా నుంచి విడివడిన అబ్కాజియా, సౌత్‌ ఒసేటియా ప్రాంతాల కోసం ఉభయ దేశాల మధ్య 2008 ఆగస్టులో దాడులు జరిగాయి. అయితే ఇటీవలి కాలంలో జార్జియా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పాలక పార్టీ అయిన జార్జియా డ్రీమ్‌- రష్యా వ్యతిరేక వైఖరిని విడనాడుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగానే మాస్కో మిత్రదేశం చైనాతో తనకున్న ద్వైపాక్షిక సంబంధాలను 2023లో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకువెళ్ళింది. అంతకుముందు 2017లో డ్రాగన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నీ కుదుర్చుకొంది. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించినప్పుడు జార్జియా తన పశ్చిమ భాగస్వాముల మాదిరిగా మాస్కో వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. దానిపై ఆంక్షలు విధించే విషయంలో దూరంగా ఉండిపోయింది. కనీసం ఉక్రెయిన్‌లో మాస్కో చర్యలనైనా బహిరంగంగా విమర్శించలేదు. ఈ ఏడాది జూన్‌లో జార్జియాలోని పాలక పక్షం విదేశీ నిధులను స్వీకరించే స్వచ్ఛంద సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రజలు వ్యతిరేకించినాసరే ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. జార్జియాలో పాశ్చాత్య శక్తుల ప్రభావాన్ని నియంత్రించడం కోసం రష్యాయే ఆ దిశగా ప్రేరేపించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సోవియట్‌ అనంతరం కూడా పశ్చిమాసియా, దక్షిణ కాకసస్‌లపై తన ప్రభావం సహజంగానే ఉంటుందని రష్యా భావిస్తోంది. అందుకే అక్కడ చైనాకు కొంత వ్యూహాత్మక స్థలాన్ని అప్పగించడానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. లేదంటే పశ్చిమ దేశాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడం కోసం అక్కడ రష్యా, చైనాలు భౌగోళికపరమైన వ్యూహంతో కలిసి పని చేయడానికి అంగీకరించి ఉండవచ్చు. అనక్లియా నౌకాశ్రయానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జార్జియా నుంచి విడిపోయిన స్వయం ప్రకటిత స్వతంత్ర దేశం అబ్కాజియా ఉంది. అక్కడి నల్ల సముద్రతీరాన ఓషమ్‌చీర్‌ నౌకాశ్రయంలో రష్యా నావికా స్థావరాన్ని అభివృద్ధి చేస్తోంది. అది పూర్తిగా రష్యా నియంత్రణలోనే ఉంది.

భారతదేశంతో పాటు దాని భాగస్వామ్య దేశాలైన అమెరికా, ఐరోపా సమాఖ్యలు చైనా చేపడుతున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టులపై ఆందోళన చెందుతున్నాయి. వాస్తవంలో ఈ ప్రాజెక్టులు చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి వాటి సార్వభౌమాధికారాన్ని పలుచన చేశాయి. తద్వారా చైనా వాటిలోని కొన్ని వ్యూహాత్మక ఓడరేవులు, విమానాశ్రయాలను తన సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఐని ఎదుర్కోవడం కోసమే జీ7 కూటమి భాగస్వామ్యంతో గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(పీజీఐఐ); భారత్‌- పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా వంటి కార్యక్రమాలు చేపడుతున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

భారత్‌ పరిస్థితేమిటి?

దక్షిణ కాకసస్‌ ప్రాంతంలో భారత్‌ ప్రాబల్యం అంతంతమాత్రమే. అక్కడ ఒక్క అర్మీనియాతోనే ఇండియాకు సన్నిహిత సంబంధాలున్నాయి. జార్జియా, అజర్‌బైజాన్‌లతో భారత్‌కు ఆ స్థాయిలో రాజకీయ సంబంధాలు లేవు. 1992 తరవాత భారత్‌కు, ఈ రెండు దేశాలకు మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సందర్శనలేవీ జరగలేదు. అజర్‌బైజాన్‌ ఇండియాకంటే పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. జార్జియాది ఇందుకు భిన్నమైన పరిస్థితి. భారత్‌తో సంబంధాల కోసం అది 15 ఏళ్ల కిందటే ప్రయత్నాలు ఆరంభించింది. కానీ, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్‌ ఎందుకు చురుగ్గా వ్యవహరించలేదో మన విధాన రూపకర్తలకే తెలియాలి! అటువంటి వైఖరివల్లే అర్మీనియా ఆవల వ్యూహాత్మకంగా ఉనికి చాటుకోవడానికి లభించిన అవకాశాలను భారత్‌ చేజార్చుకుందని భావించాలేమో! ముంబయిని రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బరోతో అనుసంధానించే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా(ఇంటర్నేషనల్‌ నార్త్‌ సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌) ప్రాజెక్టు ఇండియాకు చాలా ముఖ్యం. ఇది ఇరాన్, పశ్చిమాసియా, దక్షిణ కాకసస్‌ల మీదుగా వెళ్తుంది. దక్షిణ కాకసస్‌ మీదుగా ఐరోపాకు వెళ్ళే మరికొన్ని మార్గాలూ కీలకమైనవే. వీటి దృష్ట్యా చూసినా దక్షిణ కాకసస్‌ ప్రాంతం భారత్‌కూ అత్యంత ముఖ్యమైనదే. తాజా పరిణామాలను గమనిస్తే జార్జియా ఓవైపు రష్యా వ్యతిరేక వైఖరిని విడనాడుతూ, మరోవైపు చైనాతో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకుంటోందని అర్థమవుతుంది. అదే సమయంలో రష్యాపై అర్మీనియా విశ్వాసం కోల్పోయి పశ్చిమ దేశాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ పరిణామాలు- దక్షిణ కాకసస్‌లో భౌగోళిక రాజకీయ మార్పులకు స్పష్టమైన సంకేతాలు. భారత్‌ వాటిని నిశితంగా గమనిస్తూ సరైన దిశగా అడుగులు వేయాలి!


విఫలమైన అమెరికా, ఈయూ

అమెరికా, ఈయూలకు జార్జియాలో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ, అక్కడి అనక్లియా ఓడ రేవు ప్రాజెక్టును చైనా కైవసం చేసుకునే విషయాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాయి. కనీసం అందుకు డ్రాగన్‌ చేస్తున్న ప్రయత్నాలనైనా నిలువరించలేకపోయాయి. మిడిల్‌ కారిడార్‌లో తన సొంత ప్రయోజనాల కోసమైనా ఈయూ ఆ రేవు అభివృద్ధికి ఆసక్తి కనబరచి ఉండాల్సింది. 2012లో అనక్లియా ప్రాజెక్టుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అమెరికా దానిపై దృష్టి సారించినా, ఆ తరవాత అంతగా ఆసక్తి కనపరచలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు