International Cooperation day: సమ్మిళిత అభివృద్ధికి సహకారం

స్వతంత్ర భారతంలో పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన వారిలో చాలామంది సహకార సంఘాల నేపథ్యం కలిగినవారే. అన్ని పంచవర్ష ప్రణాళికల్లోనూ అగ్రాసనం పొందిన సహకార సంఘాలు 1991 ఆర్థిక సంస్కరణల తరవాత వెనకడుగు వేశాయి.

Published : 06 Jul 2024 01:06 IST

స్వతంత్ర భారతంలో పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన వారిలో చాలామంది సహకార సంఘాల నేపథ్యం కలిగినవారే. అన్ని పంచవర్ష ప్రణాళికల్లోనూ అగ్రాసనం పొందిన సహకార సంఘాలు 1991 ఆర్థిక సంస్కరణల తరవాత వెనకడుగు వేశాయి. ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవి మళ్ళీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  నేడు అంతర్జాతీయ సహకారోద్యమ దినోత్సవం సందర్భంగా...

దేశంలో పార్లమెంటుతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ప్రాథమిక స్థాయి నుంచి పైస్థాయి వరకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ప్రజలకు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొనే హక్కు ఉందని రాజ్యాంగంలోని 19వ అధికరణ భరోసా ఇస్తోంది. 21వ శతాబ్ది అవసరాలను తీర్చే సంస్థలుగా సహకార సంస్థలను తీర్చిదిద్దాలని జాతీయ సహకార విధానం లక్షిస్తోంది. ‘సహకార్‌ సే సమృద్ధి’ అని నినదిస్తోంది.

ఎన్నో సవాళ్లు...

పరస్పర సహకారంతో ఉత్పత్తులు, సేవల సమృద్ధిని సాధించడం సహకారోద్యమ లక్ష్యం. ఇందుకోసం సహకార సంస్థలు వనరులను సమీకరించి సమాఖ్య పద్ధతిలో ముందుకు సాగుతాయి. ప్రభుత్వం తగిన విధానాలతో వాటి పురోగతికి తోడ్పడుతుంది. యువజనుల సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేయడం ద్వారా వారిని వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే సాధనాలుగా సహకార సంస్థలు ఉపయోగపడతాయి. సత్వరమైన సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి ఈ సంస్థలు శక్తిమంతమైన సాధనాలు కాగలవు. స్వయం సహాయం, సంఘీభావం, సమానత్వం, ప్రజాస్వామ్య లక్షణాలతో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవన సాధనాలుగా సహకార సంస్థలను మలచాలని జాతీయ సహకార విధానం ఉద్దేశిస్తోంది.

దేశంలోని సహకార సంస్థలు మూలధన కొరత, నిర్వహణ లోపాలు, నియమ నిబంధనలపై సభ్యుల్లో అవగాహన లేమి, ఖాతాలను సరిగ్గా నిర్వహించకపోవడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని జాతీయ సహకార విధానం గుర్తించింది. సహకార సంఘాలకు, వాటి సభ్యులకు మధ్య వైరుధ్యం ఏర్పడుతోంది. ఇది సంస్థాగతమైన లోపం. ఈ సంఘాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, నియంత్రణల్లో కాలానుగుణంగా మార్పులు రావలసి ఉందని సహకార విధానం చెబుతోంది. ‘సహకారం’ ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల ఈ విషయంలో కేంద్ర- రాష్ట్ర కార్యాచరణ ఆవశ్యకం. ప్రస్తుతం రాష్ట్రాల్లో వేర్వేరు సహకార చట్టాలు అమలవుతున్నాయి. వాటన్నింటి మధ్య ఏకరూపత సాధించాలనే ప్రయత్నాలు సఫలం కాలేదు. సహకార సంఘాలను అభివృద్ధి సాధన సంస్థలుగా కాకుండా అధికార కేంద్రాలుగా పరిగణించడమే అందుకు మూల కారణం! జాతీయ సహకార విధానంలో అనేక లక్ష్యాలు ఉన్నాయి. 2028కల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సహకార రంగ వాటాను బాగా పెంచాలనేది ఇందులో ముఖ్యమైనది. సహకార సంస్థల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలని, వాటి నిర్వహణను మెరుగుపరచాలని, జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ అసమానతలను తొలగించాలని అది చెబుతోంది. సహకార సంస్థల సభ్యులకు శిక్షణ ఇవ్వడం, సంస్థల నిర్వహణలో అధునాతన సాంకేతికతలను వినియోగించడంతో పాటు మరింతగా మార్కెట్‌ వసతులు కల్పించాలని జాతీయ సహకార విధానం లక్షిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 2021లో సహకార రంగం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. గ్రామీణ సహకార సంఘాల వికాసానికి ఊతమిస్తోంది. గడచిన రెండేళ్లలో తీసుకున్న 54 ప్రత్యేక చర్యల గురించి కేంద్ర సహకార శాఖ వెబ్‌సైట్‌ వివరిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, మహారాష్ట్రలలో ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంస్థలను (పీఏసీఎస్‌) నాబార్డ్‌ ఛత్రం కింద పెద్దయెత్తున కంప్యూటరీకరించారు. 2022 కేంద్ర బడ్జెట్‌లో ఇందుకు కేటాయించిన రూ.2,300 కోట్ల నిధులను ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 1,03,304 పీఏసీఎస్‌లు సేద్య రంగానికి చెందినవే. వాటికి తోడుగా 351 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక గ్రామీణ రుణ కల్పనకు 14 రాష్ట్రస్థాయి వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, 533 ప్రాథమిక సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు రంగంలో ఉన్నాయి. పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీ) సంఖ్య 1550. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, మత్స్య వనరులు, బ్యాంకింగ్‌ రంగాల్లోనూ సహకార సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇంకా కార్మిక కోఆపరేటివ్‌ సొసైటీలు, వినియోగదారుల సహకార సంఘాలు, మార్కెటింగ్‌ సహకార సంఘాలు సైతం కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మహిళా సహకార సంఘాల్లో సభ్యుల సంఖ్య 54.27 లక్షలకు చేరింది. చక్కెర రంగంలో 281 సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాల మధ్య సహకారం అభివృద్ధికి రాచబాట అవుతుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. 1500కు పైబడిన పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)లలో 300 బ్యాంకులకు రూ.500 కోట్లకు మించి మూలధనం ఉంది. అవి ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను సైతం అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వాణిజ్య బ్యాంకులతోపాటు సహకార బ్యాంకుల నిర్వహణను కూడా మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను పాటించని 50 యూసీబీలపై చర్యలు చేపట్టారు.

సహకారోద్యమ దీపికలు

భారతదేశ సహకార రంగంలో మహిళల విజయాలు తక్కువేమీ కావు. గుజరాత్‌లో మహిళల ఆధ్వర్యంలోని సేవా బ్యాంక్, పుణెలోని మన్‌-దేశీ సహకార బ్యాంకుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. పుణెలో పువ్వులు, కూరగాయలు, చేపలు విక్రయించే మహిళలకు నిరక్షరాస్యతను కారణంగా చూపించి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వారే స్వయంగా బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు! అది పాతికేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇలా ఉమ్మడి ప్రయోజనాల కోసం సంఘీభావం, సమష్టి వనరులతో ఏర్పడే సంఘాలు సహకారోద్యమ దీపికలుగా నిలుస్తాయి.


విదేశాల్లో ఎన్నికల నిర్వహణ...

హకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ గురించి దక్షిణ కొరియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల నుంచి భారత్‌ నేర్చుకోవలసింది చాలానే ఉంది. కెనడా సహకార ఎన్నికలకు ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ దేశాలన్నీ సహకార సంఘాల సభ్యులకు విధి నిర్వహణ గురించి శిక్షణ ఇస్తాయి. అక్కడి సహకార సంఘాలు, సహకార బ్యాంకులు స్థిరాస్తి మార్కెట్‌లో వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతున్నాయి. సహకార సూపర్‌ బజార్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.