Dollar Value: డాలర్‌ ఆధిపత్యానికి గండి

చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్‌ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్‌ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది.

Updated : 21 Jun 2024 12:33 IST

చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్‌ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్‌ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది.

మురును డాలర్లలోనే విక్రయించాలనే ఒప్పందం కుదరడానికి ముందు- అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్దనున్న బంగారం నిల్వలతో ముడివడి ఉండేది. దీన్ని గోల్డ్‌ స్టాండర్డ్‌గా వ్యవహరించేవారు. 1974లో సౌదీ తదితర అరబ్‌ దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. దాంతో అమెరికా రంగంలోకి దిగి సౌదీ అరేబియా డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని ఒప్పించింది. దానికి బదులుగా సౌదీకి సైనిక, ఆర్థిక సహాయం చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి సౌదీతోపాటు చమురు ఎగుమతి దేశాల సంఘ (ఒపెక్‌) సభ్యదేశాలన్నీ డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపడంతో ‘పెట్రో డాలర్‌’ అనే పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది.

అమెరికా ఆధిపత్యం

అంతర్జాతీయ విపణిలో అనేక వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్‌కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ అమాంతం పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కావడంతో, దానినే తన ఆయుధంగా మలచుకునే సౌలభ్యం అమెరికాకు ఏర్పడింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం డాలర్‌ ఆయుధీకరణకు నిదర్శనం. అమెరికాకు ఎదురుతిరిగే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం కలుగుతుంది. పెట్టుబడులూ ఆగిపోతాయి. డాలర్‌తో పోలిస్తే ఆ దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపు మోయలేని భారమవుతుంది. చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం కూడా డాలర్‌ ఆధిపత్యానికి మరో కోణమే. దీన్ని సహించని రష్యా, చైనాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలలోనే లావాదేవీలు జరపాలని నిశ్చయించాయి.

బ్రిక్స్‌ వేదికగా డాలర్‌పై సమర శంఖం పూరించాయి. పెట్రో డాలర్‌కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పడం బ్రిక్స్‌కు కలిసివస్తుంది. చమురు అమ్మకాలకు ఇక నుంచి డాలర్లతోపాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య (ఈయు) యూరో, జపనీస్‌ యెన్‌లలోనూ చెల్లింపులు స్వీకరిస్తానని సౌదీ ప్రకటించింది. బిట్‌ కాయిన్లు, డిజిటల్‌ కరెన్సీలలో కూడా చెల్లింపులు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఉమ్మడి డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. సౌదీ ఇప్పటికే చైనాతో స్థానిక కరెన్సీలలో చమురు అమ్మకాలు జరపడానికి ఒప్పందం కుదుర్చుకొంది. భారత్, సౌదీలు కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.

బంగారం కొనుగోలు

పెట్రో డాలర్‌కు తెరపడటంతో అమెరికా కరెన్సీ విలువ కుప్పకూలిపోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, రష్యా గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చైనా పంతం నెగ్గడం కష్టమే. 2024 జనవరి నాటికి జపాన్‌ తరవాత అత్యధిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కొన్న దేశం చైనాయే. జపాన్‌ వద్ద 1.15 లక్షల కోట్ల డాలర్ల బాండ్లు ఉండగా, బీజింగ్‌ వద్ద 80,000 కోట్ల డాలర్‌ నిల్వలు ఉన్నాయి. భారత్‌ వద్ద కూడా 23,600 కోట్ల డాలర్ల బాండ్లు ఉన్నాయి. చైనా కనుక అమెరికా బాండ్లను ఉన్నపళాన అమ్మేస్తే డాలర్‌ విలువ తగ్గిపోతుంది కానీ, దాంతోపాటే చైనాకూ నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి చైనా డాలర్లతో బంగారం కొంటోంది. 2015లో చైనా విదేశ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా రెండు శాతం. 2023లో అది 4.3శాతానికి పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తెలిపింది. గత రెండేళ్లలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను పెంచాయని ఐఎంఎఫ్‌ ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ వెల్లడించారు. చైనా స్థానిక కరెన్సీలు, బంగారం, డిజిటల్‌ కరెన్సీల రూపంలో డాలర్‌పై బహుముఖ దాడి చేయబోతోంది. ఇతర దేశాలు కూడా తమకు అనువైన రీతిలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొంటున్నాయి. చైనా, రష్యా, ఇరాన్‌ వంటి దేశాలు డాలర్‌కు పాతర వేయాలని చూస్తుంటే, ఇతర దేశాలు డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినాసరే, ఇప్పుడప్పుడే డాలర్‌ ఆధిపత్యానికి తెరపడబోదని ఐఎంఎఫ్‌ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ప్రపంచ దేశాల వద్ద 11.45లక్షల కోట్ల డాలర్ల విదేశ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. వాటిలో 58.41శాతం డాలర్లేనని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. ఒకటి మాత్రం స్పష్టం- అమెరికా రాజకీయ విధానాలు ఆ దేశంతోపాటు మిగతా ప్రపంచంపైనా విస్తృత ఆర్థిక ప్రభావాన్ని కనబరుస్తున్నాయి.

ఏఏవీ ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.