Floods: నగరాలకు ముంపు ముప్పు

దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నగరాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంవల్ల వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. దీని నివారణకు పటిష్ఠ ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలి.

Published : 24 Jun 2024 00:55 IST

దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నగరాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంవల్ల వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. దీని నివారణకు పటిష్ఠ ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలి.

టా వానాకాలంలో నగరాలు, పట్టణాల్లోని ప్రధాన రహదారుల్లో వాననీరు నిలిచిపోతుండటం సాధారణంగా మారింది. కాలువలు నిండి ప్రవహిస్తున్న మురుగునీటి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభిస్తున్నాయి. వరదనీటిలో మునిగిన ప్రధాన రహదారుల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లు నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. కాలనీలనూ వరదనీరు ముంచెత్తుతోంది. రక్షణలేని నాలాల వ్యవస్థ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఏటా ముంపు ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. దానివల్ల రైలు, రోడ్డు మార్గాలు, వంతెనల వంటి మౌలిక వసతులకు నష్టం వాటిల్లుతోంది. నగర ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. 2019-21 మధ్య కాలంలో నగర వరదల్లో 17000 మంది దాకా మృత్యవాత పడినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పంటలకు, ప్రజా ఆస్తులకు రూ.2.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రతి సంవత్సరం నగరాల్లో ఈ పరిస్థితి పునరావృతమవుతున్నా విపత్తులను ఎదుర్కోవడంలో సన్నద్ధత లోపిస్తోంది.

పర్యావరణ వ్యవస్థల విధ్వంసం

పట్టణాలు, నగరాల్లో వరద ముంపు నివారణకు తగినన్ని సన్నాహక, తక్షణ సహాయ చర్యలు, శాశ్వత పరిష్కారాలు అవసరం. వర్షాకాలం రాక ముందే తీరైన ప్రణాళికతో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. నాలాలు, మురుగు కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలి. మురుగు కాలువలకు మరమ్మతులు చేయాలి. నాలాల వెంట ఆక్రమణలు తొలగించాలి. వరద నీరు ముంచెత్తే ఆవాసాల్లో ప్రత్యేక ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయాలి. కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ప్రతిబంధకంగా ఉన్న నిర్మాణాలను తొలగించాలి. హైదరాబాద్‌లో ఇటువంటి ప్రణాళిక సిద్ధమవుతోంది. పలు రసాయన పరిశ్రమలు వ్యర్థాల శుద్ధి చేపట్టడం లేదు. నిత్యం వెలువడే వ్యర్థాల్ని డ్రమ్ముల్లో నింపి వానలు పడ్డప్పుడు వరద నీటిలో వదిలేస్తున్నాయి. దీనివల్ల సమీప ప్రాంతాల్లోని ప్రజల మనుగడ దుర్భరంగా మారుతోంది. నిబంధనలను అతిక్రమిస్తున్న ఇలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో వరదల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలి. రహదారుల్లో నీరు నిలిచే ప్రదేశాలలో నీటిని తోడివేయడానికి పంపు సెట్లను సిద్ధంగా ఉంచాలి. అయితే, అధికార యంత్రాంగం సన్నద్ధత లోపమే నగరాలకు శాపంగా పరిణమిస్తోంది.

దేశంలోని నగరాలు, పట్టణాల్లో దశాబ్దాల నాటి మురుగునీటి పారుదల వ్యవస్థే నేటికీ వినియోగంలో ఉంది. చాలాచోట్ల ఇది శిథిల దశకు చేరుకుంది. పట్టణీకరణకు తగినట్లుగా డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, ఆధునికీకరణ జరగడం లేదు. కురుస్తున్న భారీ వర్షానికి అనుగుణంగా మురుగునీటి కాలువల సామర్థ్యం లేకపోవడం, చాలా చోట్ల వరద నీటి కాలువల నిర్మాణం జరగకపోవడం ముంపు ఉద్ధృతికి కారణమవుతోంది. ఇండియాలో భూమి లోపల పైపులతో నిర్మించినవాటికన్నా, మూతలేని బహిరంగ డ్రైౖనేజీ కాలువలే అధికం. వర్షాకాలంలో అవి నిండి వర్షపు నీటితో కూడిన మురుగు రోడ్లపైకి ప్రవహిస్తోంది. నాన్‌మెట్రో నగరాల్లో అరవై శాతం గృహాలు బహిరంగ కాలువలతోనే అనుసంధానమై ఉన్నాయని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది. దేశంలోని 416 మెట్రో నగరాల్లో 20శాతం గృహాలు మాత్రమే భూగర్భ డ్రైనేజీతో అనుసంధానమై ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ముంబయిలో 2000 కిలోమీటర్ల మేర ఉపరితల కాలువలు ఉంటే, 446 కిలోమీటర్లు మాత్రమే భూగర్భ డ్రైనేజీ విస్తరించి ఉంది. హైదరాబాద్‌లో 5000 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉండగా, ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే ఏర్పాటైంది. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణలో తీవ్ర అలసత్వం మూలంగా ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు చివరికి చిన్న పట్టణాలు సైతం ఏటా వరద ముంపు బారినపడుతున్నాయి. మంచినీటి పైప్‌లైన్లు సైతం మురుగునీటి కాలువల్లోనే ఉండటం వల్ల ఏపీ లాంటి చోట్ల అతిసారం ప్రబలుతోంది.

చిత్తశుద్ధి ఉంటేనే...

నగరాల్లో వరద ముంపు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ప్రతిపాదనలను సిద్ధం చేస్తూనే ఉన్నాయి. అవి అమలు కావడం లేదు. లేదా ఏళ్ల తరబడి అందుకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దిల్లీలో 2016లో మురుగునీటి పారుదల నూతన బృహత్‌ ప్రణాళికను రూపొందించినా, కార్యాచరణకు నోచుకోలేదు. వరదలు వచ్చినప్పుడు అంతంత మాత్రం నిధులనే సహాయక చర్యల కోసం విదిలిస్తున్నారు తప్ప, శాశ్వత ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రభుత్వాలు నిధులు కేటాయించడంలేదు. నగరాల్లో వరదల కట్టడికి స్వల్పకాలిక ప్రణాళికలు మాత్రమే సరిపోవని, వాతావరణ పోకడలకు అనువైన పూర్తిస్థాయి ప్రణాళికలు, కార్యాచరణ అవసరమని నీతిఆయోగ్‌ నివేదిక సూచించింది. నగరాల్లో వాన నీటిని వరద కాలువల ద్వారా పంపించే పద్ధతిలో ప్రాథమిక మార్పులు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. వాన నీటి శోషణకు ఇంకుడుగుంతలు నిర్మించాలి. వాన నీటిని ఇంకించుకునేలా రోడ్ల వెంట నడకదారులను నిర్మించాల్సిన అవసరం ఉంది. పట్టణ వరద సమస్యల పరిష్కారానికి కొన్ని దేశాల్లో కృత్రిమ మేధను వినియోగిస్తున్నారు. అలాంటి సాంకేతికతలను మన భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా మార్పులు చేసి వాడుకోవాలి. నగరాల బృహత్‌ ప్రణాళికల్లో వరద నివారణ వ్యూహాలు తప్పనిసరిగా ఉండాలి. తీరైన పారిశుద్ధ్య ప్రణాళిక సైతం అవసరమే. వీటి అమలుకు పాలకుల్లో చిత్తశుద్ధి, పటిష్ఠమైన యంత్రాంగం అత్యవసరం.


యథేచ్ఛగా ఆక్రమణ

డ్రైనేజీలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువులు, కుంటల ఆక్రమణలు, మడ అడవులు, చిత్తడి నేలలు కనుమరుగవుతుండటం వరద ముంపు ఉద్ధృతికి ముఖ్య కారణమని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి. ముంబయి, చెన్నై నగరాలే దీనికి ఉదాహరణ. తగిన సామర్థ్యం లేని డ్రైనేజీ వ్యవస్థ, ప్రణాళికా రాహిత్యమే నిరుడు బెంగళూరులో సంభవించిన వరదలకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద విధ్వంసానికి ప్రధాన కారణం నదీ పరీవాహక ప్రాంతాల ఆక్రమణే అని నిపుణులు గుర్తించారు. హైదరాబాద్‌లో సంభవిస్తున్న వరదలకు చెరువులు, నాలాల ఆక్రమణే ప్రధాన కారణమని ‘కిర్లోస్కర్‌ కమిటీ’ తేల్చింది. దేశంలోని అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.