France: ఫ్రాన్స్‌ దారెటు?

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అక్కడ ఏ పార్టీకీ ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇంతకుముందు జరిగిన యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను కనబరచిన అతిమితవాద నేషనల్‌ ర్యాలీ... స్వదేశీ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోయింది. ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనే అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మెక్రాన్‌ వ్యూహం ఫలించింది.

Updated : 11 Jul 2024 03:03 IST

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అక్కడ ఏ పార్టీకీ ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇంతకుముందు జరిగిన యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను కనబరచిన అతిమితవాద నేషనల్‌ ర్యాలీ... స్వదేశీ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోయింది. ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనే అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మెక్రాన్‌ వ్యూహం ఫలించింది.

ఫ్రెంచ్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడగానే ‘మనం గెలిచాం, వామపక్షాలు గెలిచాయి’ అంటూ పారిస్‌ నగర వీధుల్లో పలువురు యువతీయువకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘వాళ్లు ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల గురించి మాట్లాడరు. ఎంతసేపటికీ వలస వచ్చిన విదేశీయులు, ముస్లిముల గురించి నానా యాగీ చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకురాలేదు. అందుకే వారు చిత్తుగా ఓడిపోయారు. జాతి దుర్విచక్షణను వ్యతిరేకించే మాలాంటివాళ్లకు అది ఎంతో ఆనందం కలిగించింది’ అని 40 ఏళ్ల ఓటరు అలీ స్పందించారు. ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో అతిమితవాద నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) పార్టీ ఓటమిపై ఆయన అలా వ్యాఖ్యానించారు. 577 సీట్లు ఉన్న ఫ్రెంచ్‌ పార్లమెంటులో మెజారిటీకి కావలసిన 289 సీట్లు ఏ ఒక్క పార్టీకో కూటమికో రాలేదు. వామపక్షాల కూటమి అయిన ‘న్యూ పాప్యులర్‌ ఫ్రంట్‌’కు అత్యధికంగా 182 సీట్లు వచ్చాయి. దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మెక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి 168 సీట్లు సాధించింది. అతిమితవాద నేషనల్‌ ర్యాలీ 143 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
నెల రోజుల క్రితం యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రాన్స్‌ నుంచి నేషనల్‌ ర్యాలీ అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఎన్నికవడంతో స్వదేశీ పార్లమెంటులోనూ వారే జయకేతనం ఎగురవేస్తారనే అంచనాలు వెలువడ్డాయి. పలు ప్రజాభిప్రాయ సేకరణలూ ఆ పార్టీ గెలుపునే సూచించాయి. పైగా ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల మొదటి రౌండులో నేషనల్‌ ర్యాలీకి ఆధిక్యం లభించింది. దాంతో చాలామంది వామపక్షీయులు, మధ్యేవాదులు, ఉదారవాదులు నిద్రలేని రాత్రులు గడిపారు. చేయీచేయీ కలిపి అతిమితవాదులను గెలవనివ్వకుండా చేద్దామని తీర్మానించుకున్నారు. రెండో రౌండుకు వచ్చేసరికి నేషనల్‌ ర్యాలీ వ్యతిరేకుల విజయావకాశాలను పెంచడానికి 200 మందికి పైగా అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. తద్వారా త్రిముఖ పోటీని నివారించారు. చరిత్రకారులు, న్యాయవాదులు, ముస్లిములు, క్రైస్తవులు నేషనల్‌ ర్యాలీకి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టే పనిని ముమ్మరం చేశారు. చివరకు ఆ పార్టీని మెజారిటీకి దూరం చేయగలిగారు. కానీ, ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. ఇది ఫ్రాన్స్‌లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితికి దారితీయవచ్చు. అది ఆ దేశానికే కాదు, యావత్‌ ఐరోపాకే నష్టదాయకం. ఐరోపా సమాఖ్య(ఈయూ)కు ఫ్రాన్స్‌ మూలస్తంభం. ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. ఆ దేశం త్వరలో ఒలింపిక్స్‌ పోటీలను నిర్వహించనుంది.

రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌ అండగా నిలబడటం మాస్కోకు ఆగ్రహం కలిగిస్తోంది. అందుకే ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో రష్యా సైబర్‌ దుష్ప్రచారం సాగించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 50మంది అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఇది ఫ్రాన్స్‌లో కనీవినీ ఎరుగని పరిణామం. దాంతో ఎన్నికల రోజు ప్రభుత్వం 30,000 మంది పోలీసులను నియోగించింది. మాస్కోకు అతిమితవాద నేషనల్‌ ర్యాలీతో చిరకాల సంబంధాలున్నాయి. 2014లో ఆ పార్టీకి ఒక రష్యన్‌ బ్యాంకు 60లక్షల యూరోల రుణమివ్వడం వివాదాస్పదమైంది. ఆ రుణాన్ని నిరుడు నేషనల్‌ ర్యాలీ తీర్చివేసింది. ఒకవేళ ఆ పార్టీకి పార్లమెంటులో మెజారిటీ వస్తే ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌ మద్దతు ఉపసంహరించుకుంటుందనే భావన బలంగా పాదుకొన్నది. ఆ రకంగా నేషనల్‌ ర్యాలీ గెలుపు ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా ఐక్యతకూ విఘాతం కలిగించి ఉండేది.

తాజా ఎన్నికల ఫలితాలవల్ల మెక్రాన్‌ పదవికి ఢోకా లేదు. ఆయన 2027 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఫ్రాన్స్‌ రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు రక్షణ, విదేశాంగ విధానాలను చూసుకుంటే, స్వదేశంలో విధాన నిర్ణయాలు ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. కొత్త ప్రధానిగా వామపక్ష కూటమి నాయకుడొకరు పగ్గాలు చేపట్టవచ్చు. ప్రస్తుతానికి నేషనల్‌ ర్యాలీని అడ్డుకోవడానికి వామపక్షాలు, మధ్యేవాదులు చేతులు కలిపినా... సైద్ధాంతిక విభేదాలు పొడచూపే అవకాశముంది. మెక్రాన్‌ దేశార్థికానికి ఊతమివ్వడానికి వ్యాపార వర్గాలకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తున్నారు. సంక్షేమ రాజ్య సూత్రాలను కొంత పక్కనపెడుతున్నారు. దానివల్ల మెక్రాన్‌కు వామపక్ష ప్రధానితో ఘర్షణ ఏర్పడవచ్చు. హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్‌ను మెక్రాన్‌ పూర్తిగా సమర్థించడం వామపక్ష, ఉదారవాదులకు నచ్చడం లేదు. ఏదిఏమైనా అతిమితవాద నేషనల్‌ ర్యాలీని అధికారానికి దూరంగా ఉంచాలనే మెక్రాన్‌ వ్యూహం మాత్రం ఫలించింది.

ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.