
టీకాయుధంతో కొవిడ్‌పై పోరు
దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమానికి ఏడాది
భారతదేశం కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి నిన్నటితో ఏడాది పూర్తయింది. గడచిన సంవత్సర కాలంలో ప్రజలకు సుమారు 156 కోట్లకు పైగా టీకా డోసులు వేసిన రికార్డు నమోదైంది. 2021 జనవరి 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు యావత్ ప్రజానీకానికి వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం భారతదేశానికి ఉన్నదా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తం జనాభాకు అవసరమైన టీకాలను తయారు చేసి సకాలంలో అందించడంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. టీకాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వచేసి, అన్ని ప్రాంతాలకు వేగంగా రవాణా చేయడానికి తగిన మౌలిక వసతులు ఉన్నాయా అనే సందేహమూ వచ్చింది. టీకాలు వేయడానికి సుశిక్షిత సిబ్బంది అందుబాటులో ఉన్నారా అనేదీ సంశయమే. అనవసర భయాలతో టీకాలు వేసుకోవడానికి మొరాయించే వారిని దారికి తీసుకురావడం, మారుమూల ప్రాంతాలకూ టీకాలను చేరవేయడం సాధ్యమేనా తదితర సందేహాలూ వినవచ్చాయి. అయితే, ‘టీమ్ హెల్త్ ఇండియా’ వీటిని పటాపంచలు చేసింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందస్తు సన్నాహాలు చేసుకుని కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ఆరంభించింది. చాలా కాలం నుంచి ఇతర వ్యాధులకు విజయవంతంగా జాతీయ టీకా కార్యక్రమాన్ని అమలు చేసిన అనుభవం మనకుంది. ముఖ్యంగా గత 25 ఏళ్లలో 10 కోట్లమంది శిశువులకు పోలియో చుక్కల పంపిణీ జరిగింది. 15 ఏళ్ల వయసు వరకు 35 కోట్లమంది బాలలకు తట్టు, పొంగు వ్యాధులు సోకకుండా టీకాలు పడ్డాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం టీకా కార్యక్రమం కొనసాగింది. టీకాల నిల్వకు 29,000 శీతల గిడ్డంగులు ఏర్పాటయ్యాయి. గర్భవతులకు, టీకాలు అందని పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తిచేయడానికి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేసిన అనుభవం కొవిడ్ కాలంలో ఎంతో అక్కరకొచ్చింది. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (ఈవిన్) ద్వారా టీకాల నిల్వ, పంపిణీ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాం. ప్రధాని మోదీ సంపూర్ణ అండదండలు ‘టీమ్ హెల్త్ ఇండియా’కు గొప్ప ఊతాన్నిచ్చాయి.
నిద్రలేని రాత్రులు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖలు, ప్రజారోగ్య సంరక్షణలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు, చర్చలు జరిపి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమైన సన్నద్ధత సమగ్రంగా జరిగింది. గతేడాది జనవరి 16న కొవిడ్ టీకా కార్యక్రమం మొదలయ్యేటప్పటికే తగిన వ్యూహాలు, శిక్షణతో కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం. టీకా కార్యక్రమానికి మార్గదర్శక సూత్రాలూ రూపొందించుకున్నాం. వ్యాక్సినేషన్ వివరాలను డిజిటల్ పద్ధతిలో సేకరించే బాధ్యతను కొవిన్ వేదిక స్వీకరించింది. టీకాల పట్ల జనంలో అపోహలు, అనుమానాలు తొలగించడానికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో టీకాలు వేయడానికి ప్రయోగాత్మక పంపిణీ కార్యక్రమాలు నిర్వహించి అన్ని సాధకబాధకాలను అవగాహన చేసుకున్నాం. గతేడాది జనవరి 16న టీకా కార్యక్రమం పారంభం అవుతుందనగా 15వ తేదీన నిద్రలేని రాత్రే మిగిలింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వేలమంది కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు, కొవిన్ బృందాలు, కేంద్ర, రాష్ట్ర టీమ్ హెల్త్ ఇండియా ప్రధాన కార్యాలయాల సిబ్బంది పరిస్థితి అదే. 16వ తేదీ నుంచి టీకా కార్యక్రమం చేపట్టడానికి ఎదురైన ఒక సాంకేతిక సమస్యను అధిగమించడానికి వారు రాత్రంతా మేలుకొని ఉండాల్సి వచ్చింది.
ఒంటెలు, పడవలు, సైకిళ్లు...
మొదటి దశలో అంచనాలకు తగ్గట్టు టీకాల లభ్యత లేదు. అందుబాటులో ఉన్న టీకాలను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో సర్దుబాటు చేయడం సవాలుగా మారింది. ఆ కొరత పరిస్థితి సహజంగానే విమర్శలకు తావిచ్చింది. చేతిలో ఉన్న టీకాలను సమర్థంగా వినియోగించడానికి టీకా ఉత్పత్తిదారులతో, టీకా రవాణా సంస్థలు, శీతల నిల్వ కేంద్రాలు, కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలతో ప్రతి రోజూ గంటల తరబడి వర్చువల్ సమావేశాలు నిర్వహించాం. మారుమూల ప్రాంతాలకు టీకాలను చేరవేయడానికి బుద్ధికుశలతను ఉపయోగించాం. డొంకదారుల్లో సైకిళ్ల ద్వారా, ఎడారిలో ఒంటెలు, నదుల్లో పడవలు, కొండల్లో కూలీల సహాయంతో టీకాలు చేరవేశాం. ప్రజలకు పసుపు కుంకుమలు ఇచ్చి వ్యాక్సిన్ కేంద్రాలకు ఆహ్వానించాం. టీకాలు తీసుకోవడానికి సంకోచిస్తున్నవారి కోసం ఇంటింటికీ తిరిగి అవగాహన పెంచాం. వ్యాక్సిన్ ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ ముందుకు సాగాం. ఇక్కడ ఏ పాశ్చాత్య నమూనానూ తీసుకోకుండా పూర్తిగా స్వదేశీ నమూనానే అనుసరించాం. ‘టీమ్ హెల్త్ ఇండియా’ సభ్యుల కుటుంబ సభ్యులు కొందరు కొవిడ్ బారిన పడి మరణించారు. కొందరు స్వయంగా కొవిడ్ బాధితులయ్యారు. అవేవీ లెక్కచేయకుండా జాతి శ్రేయస్సు కోసం టీకా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని కంకణం కట్టుకుని పనిచేశాం. సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి కృషి చేశాం. దాని ఫలితమే ఇప్పుడు టీమ్ హెల్త్ ఇండియా దీక్షాదక్షతలు అందరి మన్ననలు పొందుతున్నాయి. మా కృషికి ఇలాంటి గుర్తింపు లభించడం ఎంతో ఆత్మతృప్తి కలిగిస్తోంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న టీకా కార్యక్రమం నిరుపమానం. అందుకోసం చేసిన సన్నాహాలు అపారం. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సాధకబాధకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, మా కృషికి పదును పెట్టుకుంటూ లక్ష్య సాధనకు అహర్నిశలూ పాటుపడ్డాం. ఆరోగ్యమనేది లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం అందించే సేవ. ఈ కర్తవ్య నిర్వహణలో సర్కారు సఫలమైంది. వ్యాక్సినేషన్ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిన్న ఆదివారం ఒక తపాలా బిళ్ళనూ ఆవిష్కరించింది.
దశల వారీగా...
కొవిడ్ టీకా కార్యక్రమంలో మొదటి దశ కింద వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బందికి టీకాలు వేశారు. ఫిబ్రవరి నుంచి పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయడం ప్రారంభమైంది. మార్చి ఒకటోతేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడిన వయోజనులలో ఇతర జబ్బులు ఉన్న వారికి టీకా కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్ టీకాలు వేయడం ఆరంభమైంది. మే ఒకటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి టీకా కార్యక్రమం చేపట్టారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ నుంచి 15-18 వయోవర్గానికి టీకాలు మొదలయ్యాయి. జనవరి 10 నుంచి మూడో డోసు కార్యక్రమం కూడా మొదలైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం

నెత్తురోడుతున్న రహదారులు
ప్రధాన వ్యాఖ్యానం

కడలిపై పెత్తనానికి డ్రాగన్ కుయుక్తులు
ఉప వ్యాఖ్యానం

రైతుకు నకిలీల శరాఘాతం

అలవిమాలిన ఆదాయ అంతరాలు
అంతర్యామి
