Updated : 21 Jan 2022 05:49 IST

యూపీ సమరంలో గెలిచేదెవరు?

రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు వినిపిస్తుండగా, ఆ పార్టీ నుంచి ముఖ్యులైన శాసనసభ్యులు నిష్క్రమిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. యూపీలో గెలిచి కేంద్రంలోనూ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటామన్న భాజపా ధీమాకు ఎమ్మెల్యేల ఫిరాయింపులు విఘాతం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 80-20 ఫార్ములా పేరిట చేసిన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో మతపరమైన పునరేకీకరణ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాను మతాలను ఉద్దేశించి ఈ మాట అనడం లేదని, చట్టాన్ని ఉల్లంఘించే 20శాతం, చట్టబద్ధంగా నడుచుకునే 80శాతం ప్రజలకు మధ్య తేడాను ఉటంకించడానికి మాత్రమే ఈ ఫార్ములాను ముందుకు తెచ్చానని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆదిత్యనాథ్‌ వివరించారు.

అనుకున్నంత తేలిక కాదు...
యూపీ జనాభాలో ముస్లిములు 20శాతం వరకు ఉంటారు కాబట్టి వారికి, 80శాతం హిందువులకూ మధ్య తేడా తీసుకురావడం ఆయన అసలు ఉద్దేశమని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. యూపీ జనాభాలో 19.6 శాతం ముస్లిములేనని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం, రాష్ట్రంలో 80 శాతాన్ని జాతీయవాదులుగా, మిగిలిన 20 శాతాన్ని జాతి వ్యతిరేకులుగా సీఎం యోగి చిత్రీకరించారంటూ మండిపడ్డారు. చిదంబరం వ్యాఖ్యలు తీవ్ర చర్చను రేకెత్తించాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ రాష్ట్రంలో 80 శాతం తమ పార్టీ వైపు ఉంటే, మిగతా 20 శాతమే భాజపా వైపు ఉన్నారంటూ ట్విటర్‌లో వ్యంగ్యోక్తి విసిరారు. ఇలాంటి వాదవివాదాల మధ్యే యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వైదొలగడం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు దళితులు, ఓబీసీలు, బడుగు వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ వైదొలగిన నేతలు విమర్శించారు. కొన్ని మీడియా సంస్థల సర్వేలు యూపీలో భాజపాకు గెలుపు ఖాయమని పేర్కొన్నా, కొద్ది రోజులుగా ఏకంగా 10 మందిదాకా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వీడ్కోలు చెప్పిన పరిణామాలు సర్వే ఫలితాలపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఇంకా మరింతమంది ఎమ్మెల్యేలు భాజపా నుంచి వైదొలుగుతారనే వార్తలు వినవస్తున్నాయి. ప్రముఖ ఓబీసీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య తాను భాజపా నుంచి బయటకు రావడమే కాదు, ఇకపై రోజుకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు భాజపా నుంచి వైదొలగబోతున్నారంటూ చెబుతున్నారు.

గతంలో తూర్పు యూపీ (పూర్వాంచల్‌)లోని ఒక ప్రముఖ మఠానికి అధిపతిగా పని చేసిన యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ మతానుయాయుల్లో విస్తృత ప్రాచుర్యం ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గద్దెనెక్కిన యోగి రెండోసారి కూడా గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కుతారనే భావన అత్యధికుల్లో కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలిచిన 301 సీట్లలో 62 యూపీ నుంచే లభించాయి. నరేంద్ర మోదీ విజయంలో యోగి పాత్ర కీలకమనేది నిర్వివాదాంశం. మోదీ, యోగి ద్వయం ఓటర్లను భాజపా వైపు బలంగా ఆకర్షించిందని పార్టీ అనుయాయులు విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో కులంకన్నా మతానికే ప్రాధాన్యం లభించింది. కానీ, యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కులం ముందుకొస్తోంది. 2017లో మాదిరిగా జాట్‌లు, ఓబీసీలు, దళితులు మతం ఆధారంగా భాజపా ఛత్రం కిందకు చేరడానికి ఈసారి సుముఖంగా లేనట్లుగా విదితమవుతోంది. వారు సమాంతర రాజకీయ వేదికలను నిర్మించుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భాజపా నుంచి వైదొలగడానికి కారణమిదే. ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్‌కు గెలుపు నల్లేరుపై బండినడక కాబోదనే అభిప్రాయాలున్నాయి.

భాజపాపై ప్రభావం
మజ్లిస్‌ పార్టీ యూపీలో 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం మొదట్లో కలకలం రేపింది. ముస్లిం మేధావులు, నాయకులు వెంటనే రంగంలోకి దిగి మజ్లిస్‌ గెలవడం ఖాయమనుకున్న సీట్లలోనే పోటీ చేయాలని, అలాంటి నమ్మకం లేనిచోట్ల భాజపాయేతర అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి నచ్చజెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంతమేర భాజపాపై బలమైన అభ్యర్థులను నిలబెట్టగలదనేది కీలక ప్రశ్న. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే సాగనున్నట్లు రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు భాజపా అవకాశాలను ఎంతవరకు దెబ్బతీయగలవనేది వేచిచూడాలి. ఈ రెండు పార్టీలు సొంతంగా మెజారిటీ సాధించే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో చాలామంది ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అయినా కూడా అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేవనే నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన కారణంగా యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నాయకత్వంలో భాజపా భారీ మెజారిటీ సాధించలేకపోతే అది జాతీయ స్థాయిలో భాజపా అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఏతావతా మోదీ, యోగి భవితవ్యాలు ఒకదానితో ఒకటి ముడివడిఉన్నాయి. 

సమాజ్‌వాదీ పకడ్బందీ ప్రణాళిక

యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వ పాలన తీరుపై ఏయే అంశాల్లో అసంతృప్తి ఉందో తెలుసుకుంటున్నారు. గత ఎన్నికల్లో భాజపాకు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) నాయకుడు జయంత్‌ సింగ్‌ చౌధరి నాయకత్వంలో జాట్‌లు సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది పశ్చిమ యూపీలోని 50 అసెంబ్లీ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది. మరొక యాదవేతర ఓబీసీ నాయకుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ నాయకత్వంలోని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ తూర్పు యూపీలో భారతీయ జనతా పార్టీ అవకాశాలను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజ్‌భర్‌ వర్గీయులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. పశ్చిమ యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిములు భాజపాయేతర పార్టీ వెనకే నిలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణుల అంచనా.

 

- బిలాల్‌ భట్‌

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

క్వాడ్‌ సంకల్ప దీక్ష

క్వాడ్‌ సంకల్ప దీక్ష

‘కడలి నురగలా చెల్లాచెదురవుతుంది’- ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌ల చతుర్భుజ కూటమి(క్వాడ్‌)కి లోగడ చైనా పెట్టిన పిల్లి శాపమిది!  కృత్రిమ దీవులు నిర్మిస్తూ, సైనిక స్థావరాలు నెలకొల్పుతూ,
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

చమురు ధరాభారం... ఉపశమనమెంత?

చమురు ధరాభారం... ఉపశమనమెంత?

ఎట్టకేలకు చమురు మంటల నుంచి దేశ ప్రజానీకానికి కొంతమేర ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒకపక్క, ఇతర నిత్యావసర సరకుల ధరలు మరోపక్క తారస్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోయారు.
తరువాయి

ఉప వ్యాఖ్యానం

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

గొంతు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి, శరీరంలో పలు రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. హార్మోన్లను స్రవించడం ద్వారా సాధారణ జీవక్రియలతో పాటు ఎదుగుదల, శరీర ఉష్ణోగ్రతల్ని ప్రభావితం చేస్తుంది.
తరువాయి
ఆచూకీ లేని బాల్యం

ఆచూకీ లేని బాల్యం

పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ ఉన్నట్టుండి కనిపించకుండా పోతే, ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం. అప్పటి వరకూ చేయి పట్టుకుని తిరిగి, మారాం చేసిన పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతే, ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు?
తరువాయి

అంతర్యామి

ఆంజనేయం... మహావీరం!

ఆంజనేయం... మహావీరం!

శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం.
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని