Published : 24 Jan 2022 00:11 IST

వంటింట్లో గ్యాస్‌ మంట

సామాన్యుడిపై ధరల పెనుభారం

ముడి చమురు శుద్ధి ప్రక్రియ ద్వారాగానీ, భూగర్భం నుంచి వెలికితీసే సహజవాయువు నుంచిగానీ వంట గ్యాస్‌ (ఎల్పీజీ) వస్తుంది. నిర్దిష్ట ఒత్తిడిలో ఎల్పీజీని ద్రవరూపంలోకి మార్చడంవల్ల దాన్ని సులువుగా రవాణా చేయవచ్చు. వంట గ్యాస్‌ను మండించడంవల్ల ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఇతర ఇంధనాలతో పోలిస్తే చాలా తక్కువ కాలుష్యం దానినుంచి వెలువడుతుంది. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌తోపాటు వంట గ్యాస్‌ ధరలూ ఆకాశాన్నంటుతూ పేద, మధ్యతరగతివారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. నేడు వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది. దానికితోడు పాలు, కూరగాయలు, విద్యుత్తు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏటీఎంలనుంచి నగదు తీసుకోవడంపైనా ఛార్జీల బాదుడు, ఇంకా అనేక వస్తుసేవలపై పన్ను పెంపులు సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. కొవిడ్‌ కాలంలో పూట గడిచేదెట్లా అని సామాన్యుడు తల్లడిల్లుతున్నాడు. ప్రభుత్వాలకు మాత్రం కోశాగారంలోకి పన్నుల ఆదాయం వచ్చిపడుతోంది. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరిగాయనే సాకుతో పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచే ప్రభుత్వాలు, చమురు ధరలు దిగి వచ్చినప్పుడు పెంచిన పన్నులను తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రం కంటితుడుపుగా పన్నులు తగ్గించి, పోలింగ్‌ పూర్తయ్యాక మళ్ళీ పన్ను బాదుడు కొనసాగిస్తున్నాయి.

ప్రభుత్వరంగ సంస్థల హవా

భారత్‌లో 2014-15లో 14.83 లక్షల టన్నులు ఉన్న వంటగ్యాస్‌ వినియోగం 2020-21కల్లా 22.97 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ఇండియా ఉత్పత్తి చేస్తున్నదానికి రెట్టింపు వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నందువల్ల గిరాకీని తీర్చడానికి దిగుమతులే శరణ్యమవుతున్నాయి. సగం ఉత్పత్తి, సగం దిగుమతులతో నెట్టుకొస్తున్నారు. దేశీయ మార్కెట్లో ప్రధాన వంటగ్యాస్‌ సరఫరాదారులు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలే. వాటికి దేశమంతటా ఇరవై అయిదు వేలకు పైగా విక్రయశాలలు ఉండగా, ప్రైవేటు చమురు కంపెనీలు కేవలం 100 విక్రయశాలలనే నిర్వహిస్తున్నాయి. దేశంలోని 200 ఎల్పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లలో 197 ప్రభుత్వ రంగ సంస్థలవే. ఆటోలకు ఎల్పీజీని అందించే 651 బంకులు పూర్తిగా ప్రభుత్వ రంగ కంపెనీలవే.

దేశంలో మొత్తం 29.06 కోట్లమంది వంటగ్యాస్‌ వినియోగదారులు ఉండగా, వారిలో ఎనిమిది కోట్లమంది ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులు. వంటకోసం బొగ్గు, వంటచెరకు, పిడకలవంటి కాలుష్యకారక ఇంధనాల వినియోగంనుంచి కాలుష్య రహిత వంటగ్యాస్‌ వైపు ప్రజలను మళ్ళించడానికి 2016 మేలో ఉజ్జ్వల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేడు భారత్‌లో నెలకు 14.5 కోట్ల వంటగ్యాస్‌ సిలిండర్లు వినియోగమవుతున్నాయి. ఈ లెక్కన ప్రతి భారతీయ కుటుంబం సగటున ప్రతి రెండు నెలలకు ఒక సిలిండర్‌ను ఉపయోగిస్తోంది. 2014-15లో 56శాతం భారతీయులు వంటగ్యాస్‌ను వినియోగించగా, ఉజ్జ్వల యోజనవల్ల 2021 జూన్‌ నాటికి వారి సంఖ్య 99.9శాతానికి పెరిగింది. ఎల్పీజీ వినియోగదారుల్లో కుటుంబాలు, వ్యాపారులే అత్యధికం. 2019-20లో మోటారు వాహనాలు 1.72 లక్షల టన్నుల ఎల్పీజీని వినియోగించుకున్నాయి. కొవిడ్‌వల్ల 2020-21లో అది 12శాతం తగ్గింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 13.6 కోట్లమందికి ఎల్పీజీని సరఫరా చేస్తుంటే, బీపీసీఎల్‌ 7.5 కోట్లమందికి, హెచ్‌పీసీఎల్‌ 7.9 కోట్లమందికి సరఫరా చేస్తున్నాయి.

మరోసారి శ్వాస సంబంధ సమస్యలు

రాయితీ బిల్లు పెరిగిపోవడం వల్లే వస్తుసేవల ధరలు అధికమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ వంకతో అన్ని వర్గాలపై ఎడాపెడా పన్నులు పెంచేస్తోంది. ఎల్పీజీ ధరలు పెరిగిపోతున్నందువల్ల పేదలు వంటగ్యాస్‌ వాడటం మానేస్తున్నారు. ఉజ్జ్వల పథకం కింద ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన పేదలు ఇప్పుడు దాన్ని పక్కనపడేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌లో ఉజ్జ్వల కనెక్షన్లు అత్యధికం. ఆ పథకం లబ్ధిదారుల్లో 75శాతం మాత్రమే రెండో సిలిండర్‌ తీసుకున్నారని, 57శాతం మూడు, అంతకు ఎక్కువ సిలిండర్లు కొనుగోలు చేశారని కాగ్‌ నివేదిక వెల్లడించింది. వారిలో అత్యధికులు దిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో నివసిస్తున్నారు. వాస్తవంలో ఒక కుటుంబానికి ఏటా సగటున 6.3 సిలిండర్ల అవసరం ఉంటుంది. ధరలు పెరిగి సబ్సిడీలు తరిగిపోయినప్పుడు ప్రజలు వంటగ్యాస్‌ వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌లలో 40శాతం కుటుంబాలు వంట చెరకును ఉచితంగా సేకరించుకొంటాయని, అందువల్ల వారు వెయ్యి రూపాయలు పోసి వంటగ్యాస్‌ సిలిండర్‌ కొనడానికి ఇష్టపడరని స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ నివేదిక వెల్లడించింది. ఏతావతా ఉజ్జ్వల పథకం అరకొర ఫలితాలు చూపిందని స్పష్టమవుతోంది. రాయితీ అనేది నేడు మిథ్యగా మారింది. పెరిగిన వంట గ్యాస్‌, పెట్రో ఉత్పత్తుల ధరలు మధ్యతరగతి నడ్డివిరుస్తున్నాయి. ఉజ్జ్వల పథకం కింద పేదలు సిలిండర్లు కొనడం మానేయడంతో, అవి నల్ల బజారుకు తరలి పోవడానికి ఆస్కారం ఉంది. కుటుంబాలకు చేరాల్సిన సిలిండర్లు హోటళ్లకు, ఇతర వాణిజ్య అవసరాలకు మళ్ళిపోతున్నాయి. వంట గ్యాస్‌ ధరలు చుక్కలనంటడం వల్లనే పేదలు వాడకం తగ్గించుకుంటున్నారు లేదా పూర్తిగా మానేస్తున్నారు. జనం ఎల్పీజీని వదలి మళ్ళీ కట్టె పొయ్యిలు వెలిగిస్తున్నారు. అంటే గృహిణులు మరోసారి శ్వాస సంబంధ రుగ్మతల పాలయ్యే ముప్పుపెరిగిందన్నమాట!


కొల్లబోతున్న రాయితీ

వంటగ్యాస్‌ వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా రాయితీని జమచేసే పహల్‌ పథకం 2013 నుంచి ప్రారంభమైన తరవాత ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. మొదట్లో సబ్సిడీలను బాగానే జమ చేసిన కేంద్రం క్రమంగా ఆ మొత్తాలకు కోత పెట్టసాగింది. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని మెలిక పెట్టింది. ఆ విధానం చమురు కంపెనీలకు లాభించి, వినియోగదారులపై భారం పెరిగింది. 2019-20 బడ్జెట్‌లో పెట్రోలియం, సహజవాయు శాఖకు రూ.38,529 కోట్లు కేటాయించగా, గతేడాది బడ్జెట్‌లో అది రూ.15,944 కోట్లకు తగ్గిపోయింది. దానిలో ఇంధన సబ్సిడీ వాటా రూ.1,000 కోట్లకన్నా తక్కువే! నిరుటి కేంద్ర బడ్జెట్‌ అంచనాల ప్రకారమూ వంట గ్యాస్‌ రాయితీ 36శాతం తగ్గింది. ఈ సంవత్సరం కేంద్రం పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌, వంటగ్యాస్‌ సబ్సిడీలను ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. పైగా, వాటి ధరలు, పన్నులు పెంచడం ద్వారా ఖజానాకు అదనపు నిధులను సమకూర్చుకోనుంది. 2014 ఏప్రిల్‌లో ఒక సిలిండర్‌కు రూ.567 చొప్పున సబ్సిడీ జమ చేశారు. ఇప్పుడది రూ.20కి పడిపోయింది. 2020 మేలో కొవిడ్‌ విజృంభించినప్పటి నుంచి కేంద్రం ఎల్పీజీ సబ్సిడీలను బిగపట్టి రూ.27,000 కోట్లు వెనకేసుకుందని అంచనా.


Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

నెత్తురోడుతున్న రహదారులు

నెత్తురోడుతున్న రహదారులు

నిత్య నరమేధానికి ప్రబల కారణమవుతున్న అవి రహదారులు కావు... కోర సాచిన ‘తారు’ పాములు! రహదారి భద్రతకు తూట్లు పడి కొన్నేళ్లుగా రోడ్డుప్రమాదాల్లో లక్షలాది కుటుంబాలు చితికిపోతున్న దేశం మనది. కొవిడ్‌ సంక్షోభ వేళ 2020 సంవత్సరంలో ...
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని దక్షిణ చైనా సముద్రం గత 20 ఏళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. పసిఫిక్‌ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనా కడలి 35 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దానిపై పూర్తి ఆధిపత్యానికి డ్రాగన్‌ దేశం అర్రులు చాస్తోంది. మత్స్య సంపద, ముడిచమురు, గ్యాస్‌ నిల్వలు అపారంగా
తరువాయి

ఉప వ్యాఖ్యానం

రైతుకు నకిలీల శరాఘాతం

రైతుకు నకిలీల శరాఘాతం

హరిత విప్లవం అనంతరం వ్యవసాయ దిగుబడులు పెరగడంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కీలక భూమిక పోషించాయి. దేశంలో ఎరువులు, పురుగు మందుల తయారీ, నూతన వంగడాల రూపకల్పనకు వేల సంఖ్యలో ప్రైవేటు సంస్థలు..
తరువాయి
అలవిమాలిన ఆదాయ అంతరాలు

అలవిమాలిన ఆదాయ అంతరాలు

‘దారిద్య్రం, అసమానతలు, అన్యాయాలు కొనసాగినంతకాలం ఎవరికీ సాంత్వన దొరకదు’ అన్నారు నెల్సన్‌ మండేలా. భారత్‌లో ఆదాయ పంపిణీలో అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆదాయ అసమానతల నివేదిక-2022 ప్రకారం...
తరువాయి

అంతర్యామి

ఆకులు రాల్చిన కాలం!

ఆకులు రాల్చిన కాలం!

గతించిన బాల్యం, గడచిన కౌమారం, ఆనందవాహినిలో తేలిపోయిన యౌవనం... ఎవరికైనా తీపిగుర్తులుగా మిగిలిపోతాయి. సుదూర గతం, సమీప గతం అన్న తేడా లేకుండా అన్నింటినీ కాలం క్రమంగా సౌధంలా పేర్చి సుందర భవనంలా నిలుపుతుంది. గతం కొందరికి మృతం...
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని