Updated : 16 Apr 2022 04:46 IST

సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పు

వ్యవసాయం ఆర్థికాభివృద్ధికి, ఆహార భద్రతకు ప్రాణాధారం. కానీ, సగటు రైతులకు వ్యవసాయం భారమైంది. రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వినియోగం, తగ్గుతున్న భూసారం తదితర కారణాలు దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరుగుతూ- గడచిన మూడు దశాబ్దాలుగా పట్టణీకరణ ఊపందుకొంది. ఈ తరహా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ప్రమాదం పొంచిఉందని ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమితి తాజాగా విడుదల చేసిన ‘ఆహారం, వ్యవసాయ భూమి, నీటి వనరుల పరిస్థితి-2021’ నివేదిక పలు కీలక అంశాలను వెల్లడించింది. పట్టణీకరణవల్ల 2000-2017 మధ్య కాలంలో సాగు భూమి 20శాతం తగ్గిందని తెలిపింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠంగా 33 లక్షల హెక్టార్ల సారవంతమైన పంట భూములను పట్టణీకరణవల్ల కోల్పోవలసి వస్తుందని ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ నివేదిక మదింపు వేసింది. పట్టణీకరణవల్ల పంట భూముల నష్టం- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సంభవిస్తుందని మరికొన్ని అధ్యయనాలు చాటుతున్నాయి. పట్టణీకరణ అనివార్యమైనందువల్ల ఆహార భద్రత ప్రమాదంలో పడకుండా అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదకత పెంచాలని, ఆహార వ్యవసాయ సంస్థ సూచించింది.

నిస్సారమవుతున్న పొలాలు
భారతదేశంలో పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. పట్టణీకరణతో దేశంలో 2000-2010 మధ్య కాలంలో ఏడు లక్షల హెక్టార్ల మేర సాగు భూమి తగ్గింది. మొదట్లో పట్టణాల విస్తరణవల్ల చిన్న నగరాల చుట్టూ వ్యవసాయ భూమికి నష్టం జరిగింది. 2001-10 మధ్య కాలంలో ప్రతి రాష్ట్రం కనీసం ఒక శాతం వ్యవసాయ భూమిని కోల్పోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ భూమి నష్టం జరిగింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు నెలకొల్పిన చోట నష్టం ఎక్కువగా నమోదైంది. సాగు రంగంలో సమస్యలతో పట్టణీకరణ వేగం పెరిగినప్పటికీ- ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 20శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రజాపంపిణీ విధానంలోని లోపాలను పరిహరిస్తే దేశంలో ఆహార భద్రతకేమీ లోటుండదు. తెలుగు రాష్ట్రాలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిలో, ఎగుమతుల్లో గణనీయమైన పురోగతిని సాధించాయి.

గ్రామీణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పట్టణ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జరిగే పరివర్తన మానవ సమాజ గతిలో అనివార్యమైన పరిణామం. ఆ పరివర్తన సజావుగా సాగడానికి వ్యవసాయ రంగ అభివృద్ధి కీలకం. ప్రభుత్వ వ్యయం, ప్రైవేటు పెట్టుబడులు వ్యవసాయ కార్యకలాపాల స్థాయిని పెంచుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ తన తాజా నివేదికలో పలు సూచనలు చేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపుదలకు కీలకమైన భూమి, నీటి వనరుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించింది. నేడు అనుసరిస్తున్న సాగు విధానాలవల్ల నేలపైన ఉన్న సారవంతమైన పైపొర క్రమేపీ నాశనమై భూమి నిస్సారమవుతోంది. దీర్ఘకాలం ఒకే పంటను సాగు చేయడం అందుకు ప్రధాన కారణం. భూమిలో సేంద్రియ పదార్థాలు తగ్గకుండా చూడాలి. భూయాజమాన్య వ్యవస్థలను పటిష్ఠం చేయాలి. భూసార నిర్ధారణకు భారత ప్రభుత్వం మృత్తికా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. భూసార నిర్ధారణ అనంతరమే అవసరమైన మేరకు ఎరువులను ఉపయోగించాలి. సమర్థమైన, సమగ్ర నీటి నిర్వహణ పద్ధతులను అవలంబించాలి. కేవలం భూగర్భ జలాల పైనే ఆధారపడకుండా వాన నీటిని ఒడిసి పట్టడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించాలి. 

సాంకేతికతతో ఊతం
భూమి, నీటి యాజమాన్య వ్యవస్థ నిర్వహణకు, పర్యవేక్షణకు బ్లాక్‌ చెయిన్‌, కృత్రిమమేధ వంటి అధునాతన సాంకేతికతలు అద్భుతంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ యాంత్రీకరణలో నవీన ఆవిష్కరణలకు మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞానం విరివిగా వ్యాప్తిలోకి వస్తోంది. రిమోట్‌ సెన్సింగ్‌ సేవలు, క్లౌడ్‌ ఆధారిత కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలు అందించే సమాచారం ముఖ్యంగా చిన్న రైతులకు ఎంతో ప్రయోజనకరం. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు- భూమి, మృత్తిక నీటి యాజమాన్య నిర్వహణ వ్యవస్థలు, వాటికి సంబంధించిన సాంకేతికతలపై పెట్టాలి. ఇవి ఎక్కువగా దీర్ఘకాలం సహజ వనరుల పరిరక్షణకు ఉపయోగపడేలా ఉండాలని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక సూచించింది. పట్టణీకరణ వినియోగానికి సారవంతమైన భూములను ఉపయోగించరాదు. ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతుల ద్వారా ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు సుక్షేత్రాలను నివాస, పారిశ్రామిక భూములుగా మారుస్తున్నాయి. పట్టణీకరణ, వ్యవసాయ భూముల వినియోగం మధ్య సమతౌల్యం ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలతో సాగులో సంక్షోభం నెలకొంటుంది. ప్రణాళికారహితంగా విచ్చలవిడిగా పట్టణాలు విస్తరించడంవల్ల ఎన్నో రకాల ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ రెండు పరిస్థితులూ అవాంఛనీయమే. వాటిని నివారించేందుకు ప్రణాళికాయుతమైన పట్టణీకరణ, పటిష్ఠ వ్యవసాయ విధానాల రూపకల్పన చాలా అవసరం.


పరస్పర ఆధారితాలు

వ్యవసాయంలో పురోగతే పారిశ్రామిక విప్లవానికి దారులు పరచిందనేది చారిత్రక సత్యం. పారిశ్రామిక విప్లవం నుంచే పట్టణాలు, నగరాలు ఉద్భవించాయి. పట్టణీకరణను వ్యవసాయం ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తోంది. పట్టణ ప్రాంతాలకు ఆహారం సరఫరా చేస్తోంది. పారిశ్రామిక రంగానికి అదనంగా శ్రామికులను, ముడి సరకులను సరఫరా చేస్తోంది. తయారీ రంగం నుంచి లభించే ఆదాయంలో సగం వరకు వ్యవసాయాధారిత పరిశ్రమలవల్లే లభిస్తోంది. ఈ అంశాలన్నీ పట్టణీకరణకు మార్గం సుగమం చేస్తాయి. వ్యవసాయ రంగం, పట్టణీకరణ పరస్పరాధారితాలు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య జరిగే వస్తు వినియోగం వల్ల వ్యవసాయ రంగం, పట్టణీకరణ ప్రక్రియ రెండూ ప్రయోజనం పొందుతాయి. పట్టణాలు వ్యవసాయోత్పత్తులకు, గ్రామాలు పట్టణాల్లోని పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెట్‌గా ఉపయోగపడతాయి. విద్య, వైద్యం వంటి సేవల కోసం పట్టణాలకు గ్రామీణ ప్రజల వలసలు పెరుగుతాయి. భారత పట్టణ జనాభాలో 30శాతం గ్రామీణ వలసల ద్వారా వచ్చినవారే. స్థానిక మార్కెట్ల కోసం ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచుతాయి.


 

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని